Telugu Global
Andhra Pradesh

తెలుగు ప్రజలకు బాబు లేఖ.. అంబటి ఘాటు కౌంటర్‌

జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్‌ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి తాను వెళ్లటం లేదని, మీ పేరిట టీడీపీయే ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి.. ఆ ఉత్తరం చదివిన తరవాత నేను మీకు బహిరంగ లేఖ రాస్తున్నానని వివరించారు.

తెలుగు ప్రజలకు బాబు లేఖ.. అంబటి ఘాటు కౌంటర్‌
X



స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో గత 45 రోజులుగా రిమాండులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దసరా పండుగ సందర్భంగా జైలు నుంచే తెలుగు ప్రజలనుద్దేశించి ఆదివారం ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని తెలిపారు. 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరిపేయలేరని పేర్కొన్నారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందని.. తాను త్వరలో బయటకొస్తానని లేఖలో తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని కూడా పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.



అయితే చంద్రబాబు లేఖకు కౌంటర్‌గా ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. చంద్రబాబు నాయుడుగారికి.. అంటూ నేరుగా ఆయన్నే అడ్రస్‌ చేస్తూ ఈ లేఖ విడుదల చేయడం గమనార్హం. ఇంతకీ ఆయన లేఖ సారాంశమేమిటంటే.. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా, నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ మీరు ఉత్తరం రాశారంటూ అంబటి పేర్కొన్నారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్‌ డీటెయిల్స్‌లోకి, 17(ఏ) ప్రొటోకాల్స్‌లోకి తాను వెళ్లటం లేదని, మీ పేరిట టీడీపీయే ఆ ఉత్తరం ఇచ్చింది కాబట్టి.. ఆ ఉత్తరం చదివిన తరవాత నేను మీకు బహిరంగ లేఖ రాస్తున్నానని వివరించారు. ఇందులో కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నట్టు తెలిపారు. అవేంటంటే..

1. మొదటి వాక్యమే మీరు జైలులో లేనని రాశారు. కాబట్టి దయచేసి మీ న్యాయ పోరాటం మొత్తాన్ని ఆపేయండి. క్వాష్‌ పిటిషన్లు, బెయిల్‌ పిటిషన్లు ఉపసంహరించుకోండి.

2. ప్రజల గుండెల్లో ఉన్నారని రాశారు. అదే నిజమైతే.. మీ పేరు చెబితే గుర్తుకు వచ్చే నాలుగు స్కీంలు దయచేసి ప్రజలకు తెలియజేయండి.

3. మీ కోసం ప్రజా చైతన్యం ఉవ్వెత్తున ఎగిసిపడుతోందని అన్నారు. ఎగిసిపడుతున్న ఆ ప్రజలు ఎవరో దయచేసి తెలియజేయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద వర్గాలను కూడా ప్రజలే అని గుర్తించండి. వారిలో ఏ ఒక్కరూ మీరు చేసిన ద్రోహాన్ని మర్చిపోలేదు.

4. మీ రాజకీయ జీవితం అంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం సాగిందన్నారు. తెలుగు ప్రజలు అంటే... మీ ఉద్దేశంలో ఎవరు? హైదరాబాద్‌ మెట్రోలో నల్ల చొక్కాలు వేసుకున్న ఆ నలుగురునా? అమెరికాలో, బ్రిటన్‌లో, మీ దోపిడీ సొమ్ములతో స్థిరపడిన మీ బంధుగణాలా? ఎన్టీఆర్‌ను మీరు వెన్నుపోటు పొడవటంలో సహకరించిన మీ మీడియా మిత్రులా? బీజేపీలో ఉన్న మీ బంధువులా? కాంగ్రెస్‌లోకి పంపించిన మీ మనుషులా? కొద్దిమంది వామపక్షాల నాయకుల్లో ప్రవహిస్తున్న మీ పసుపు రక్తమా? ఎవరు తెలుగు ప్రజలంటే అన్నది దయచేసి తెలియజేయండి.

5. ఓటమి భయంతో మిమ్మల్ని జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలని ఎవరో అనుకుంటున్నారని రాశారు. ఒక అవినీతిపరుడ్ని కేంద్ర ఐటీ శాఖ పట్టుకుని షోకాజ్‌నోటీసు ఇచ్చింది. అది మీరే. స్కిల్‌ స్కాంలో నలుగురిని ఈడీ అరెస్టు చేసింది. ఆ స్కీంలో కర్త, కర్మ, క్రియ మీరే. స్కిల్‌ స్కాంలో మీకు కోర్టు రిమాండ్‌ విధించింది. ఆ రిమాండ్‌ను హైకోర్టు, సుప్రీంకోర్టు సమర్థించాయి. మరి, ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరో దూరం చేయటం ఏమిటి? 45 ఏళ్లు దొరక్కుండా తప్పించుకున్నానన్న మీ ఆత్మవిశ్వాసం, 45 ఏళ్ల మీ వ్యవస్థల మేనేజ్‌మెంట్‌ ఈసారి మీకు సాధ్యం కాలేదు. కాబట్టి.. దొరికిపోయిన దొంగ దేశభక్తుడ్ని అని, ప్రజాసేవకుడ్ని అని భారీ డైలాగులు చెప్పటం బాగోదు.

6. ఇక, సంకెళ్లు మీ సంకల్పాన్ని బంధించలేవని, జైలు గోడలు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయలేవని రాశారు. మీ మీద మీకు అంత సీను ఉంటే.. మీకు అంత ధైర్యం ఉంటే.. మీ మీద అంత నమ్మకం ఉంటే.. మీ ఆదాయం ఎంత? మీ ఆస్తులు ఎంత? అన్న అంశం మీద నేను ఒక పిటిషన్‌ వేస్తాను. కోర్టుల్లో స్టే కోసం వెళ్లకుండా సీబీఐ విచారణకు సిద్ధపడతారా?

7. స్కిల్‌ స్కాంలో వేరే వ్యక్తి ఎవరో సీబీఐ విచారణ జరగాలని పిటిషన్‌ వేస్తే మీ గుడ్డలు ఎందుకు తడుస్తున్నాయి.? రాష్ట్ర ప్రభుత్వ విచారణ కక్ష సాధింపు అని మీరు అంటున్నారు. అదే నిజమైతే.. కేంద్ర ప్రభుత్వ సీబీఐ విచారణకు మీరు ఆహ్వానించాలి కదా.? మరి, రెండింటికీ గుడ్డలు తడుస్తున్నాయంటే మీరు లేఖలో రాసిన డైలాగులు అన్నీ ఆత్మవంచనతో కూడిన అబద్ధాలే కదా.?

8. ఇక, దసరాకి పూర్తి మేనిఫెస్టో విడుదల చేయలేకపోయానని మరో భారీ డైలాగు వదిలారు. 2014 మేనిఫెస్టోలో మీరు చేసిన 650 వాగ్దానాలకు, అధికారంలోకి వచ్చాక మీరు చేసిన మొదటి సంతకాలకు ఏనాడూ దిక్కూమొక్కూ లేదు. కాబట్టే.. మిమ్మల్ని ప్రజలు... మీరు కొనుగోలు చేసిన ఎమ్మెల్యేల సంఖ్యకు మీ పార్టీని పరిమితం చేశారు. ఇప్పుడు మీరు మరో మేనిఫెస్టో విడుదల చేస్తే ఎంత? చేయకపోతే ఎంత?

9. ఈ రాష్ట్రంలో ఉండని మీరు, మీ పుత్రుడు, మీ దత్తపుత్రుడు మా రాష్ట్రంలో కేవలం గెస్ట్‌లు మాత్రమే కదా. ఇది మీకు వీకెండ్‌ రిసార్ట్‌ మాత్రమే కదా.?

10. ఎప్పుడూ బయటకు రాని మీ భార్యను మీరు ప్రజల్లోకి పంపుతున్నారని అన్నారు. ఎందుకండీ.. ఆవిడను ప్రజల్లోకి పంపటం.? ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పుడే, కన్నతండ్రి పక్షాన గాక.. మీ పక్షాన ఉన్న ఆమె – ఇప్పుడు ఎన్టీఆర్‌ వారసురాలు ఎలా అవుతుంది? ఆవిడ నిజం గెలవాలి అంటూ నినాదం చేస్తే.. మొదట ఎన్టీఆర్‌ను మీరే పొడిచారన్న నిజం చెప్పి ఆ తర్వాత ఏం మాట్లాడినా ఒకరో, ఇద్దరో నమ్ముతారు.

11. నా బలం జనమే అంటూ రాశారు. ఈ మధ్య జగన్‌ గారి స్పీచ్‌లు బాగా చూస్తున్నారని అర్థమైంది. జగన్‌ గారు పొత్తుల్ని నమ్ముకోవట్లేదండీ. తాను చేసిన ఇంటింటి అభివృద్ధిని, ఇంటింటికి పంపిన రూ.2.38 లక్షల కోట్ల డీబీటీని, ఇచ్చిన 31 లక్షల ఇళ్ల పట్టాలను, కడుతున్న 22 లక్షల ఇళ్లను, గ్రామ గ్రామంలోనూ తీసుకొచ్చిన మార్పులను చూపించి మీరే నా బలం అని ప్రజలతో ఉన్నది ఉన్నట్టు చెబుతున్నారు. మరి, మీరు.. ఆయన డైలాగ్‌ బాగుంది కదా అని నేనూ అంటానని అదే డైలాగ్‌ చెబితే బాగోదేమో అన్నది ఆలోచించుకోండి!

12. ఇక, చెడు గెలిచినా నిలవదన్నారు. మంచి తాత్కాలికంగా ఓడినా కాల పరీక్షలో గెలుస్తుందని అన్నారు. జగన్‌ గారి విషయంలో జరిగింది అదే కదా. ఆ చెడు చేసింది మీరే కదా?

మీ దుష్ట బృందంలో అందరికీ వయస్సు పెరిగిపోయింది. కానీ, జీవన సంధ్యా సమయంలో కూడా నిజాన్ని ఒప్పుకునే అంతరాత్మ మాత్రం ఏ ఒక్కరికీ లేదు. మీరు ఇలాంటి లేఖలు మరిన్ని రాయాలని కోరుకుంటున్నానంటూ అంబటి తన లేఖను ముగించడం గమనార్హం.


First Published:  22 Oct 2023 7:35 PM IST
Next Story