Telugu Global
Andhra Pradesh

'బ్రో'కి అంబటి రివ్యూ.. సినిమా తీస్తానంటున్న మంత్రి

సినిమాలో శ్యాంబాబు అనే చిన్న పాత్ర పెట్టి తనను గోడపక్కనుంచి గోకడమెందుకని మండిపడ్డారు మంత్రి అంబటి. సంబరాల రాంబాబు అనే టైటిల్ పెట్టి నేరుగా తనని గోకొచ్చుకదా అన్నారు.

బ్రోకి అంబటి రివ్యూ.. సినిమా తీస్తానంటున్న మంత్రి
X

నిత్య పెళ్లికొడుకు

పెళ్లిళ్లు-పెటాకులు

తాళి-ఎగతాళి

మూడు ముళ్లు - ఆరు పెళ్లిళ్లు

బహుభార్యా ప్రవీణుడు

MRO (మ్యారేజెస్ - రిలేషన్స్ - అఫెండర్)

అయిన పెళ్లిళ్లెన్నో.. పోయిన చెప్పులెన్నో..

ఇవీ ప్రెస్ మీట్ లో మంత్రి అంబటి రాంబాబు చెప్పిన సినిమా టైటిళ్లు. పవన్ కల్యాణ్ పై తాను తీయబోయే సెటైరికల్ మూవీకి ఇందులో ఓ టైటిల్ ఫిక్స్ చేస్తున్నామని, జర్నలిస్ట్ లు కూడా సలహాలు సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు. పవన్ వ్యక్తిగత జీవితాన్ని బేస్ చేసుకుని ఓ సెటైరిక్ కథను కూడా ప్రెస్ మీట్ లోనే వివరించారాయన. తమది లో బడ్జెట్ మూవీ అని, అందువల్ల ఫెయిలయ్యే ఛాన్స్ లు లేవన్నారు.


ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్..

'బ్రో' సినిమాలో శ్యాంబాబు అనే పాత్ర, దాని చుట్టూ ఉన్న డైలాగులు కనీసం ఒక నిమిషం పాటు కూడా ఉండవు. అయితే అంబటి రాంబాబు డ్యాన్స్ ని ఇమిటేట్ చేసినట్టుగా ఉండే శ్యాంబాబు పాత్ర విడుదల తర్వాత బాగా హైలెట్ అయింది. దీంతో మంత్రి అంబటికి బాగా కోపం వచ్చింది. అందుకే వరుసగా ఆ సినిమాకోసమే ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దర్శక నిర్మాతలపై సానుభూతి చూపిస్తూ, వారి డబ్బుని, కాలాన్ని పవన్ తన శునకానందం, పైశాచికానందం కోసం వృథా చేశారన్నారు. ఈసారి ప్రెస్ మీట్ లో త్రివిక్రమ్ ని కూడా కలిపి విమర్శించారు మంత్రి అంబటి.

అంబటి మార్కు రివ్యూ..

'బ్రో' సినిమా వసూళ్ల గురించి కూడా ప్రెస్ మీట్ లో ప్రస్తావించారు మంత్రి అంబటి రాంబాబు. బ్రో ఎందుకు ఫ్లాపయిందంటే..? అంటూ రెండు బలమైన కారణాలు కూడా చెప్పారు. అవసరం లేకుండా శ్యాంబాబు లాంటి పాత్రల్ని పెట్టి సబ్జెక్ట్ ని పక్కదోవ పట్టించారని అన్నారు. వారాహి అని అమ్మవారి పేరు పెట్టుకున్న వాహనంపై ఎక్కి పవన్ కల్యాణ్ ప్రసంగాలు చేస్తున్నందున.. ఆయనకు అమ్మవారి శాపం తగిలిందని, అందుకే పవన్ సినిమాలేవీ ఇక సక్సెస్ కావని వివరించారు. కనీసం పవన్ రెమ్యునరేషన్ కి సరిపోయేంత వసూళ్లు కూడా ఆ సినిమాకు రాలేదంటూ వెటకారం చేశారు మంత్రి అంబటి.

నేరుగానే గోకొచ్చు కదా..?

సినిమాలో శ్యాంబాబు అనే చిన్న పాత్ర పెట్టి తనను గోడపక్కనుంచి గోకడమెందుకని మండిపడ్డారు మంత్రి అంబటి. నేరుగా సంబరాల రాంబాబు అనే టైటిల్ పెట్టి తనని గోకొచ్చుకదా, అప్పుడు తాను బదులిచ్చేవాడిని కదా అన్నారు. ఆ సినిమాపై తనకేమీ కోపం లేదని, తలచుకుంటేనే నవ్వొస్తోందని చెప్పారు. ఫైనల్ గా తన స్నేహితులతో కలసి తాను ఫుల్ లెంగ్త్ సెటైరిక్ మూవీ తీస్తున్నానంటూ కొన్ని టైటిల్స్ చదివి వినిపించారు.

ఏంటి'బ్రో' ఇది..?

అంబటి ప్రెస్ మీట్ తర్వాత జనసైనికులు సోషల్ మీడియాలో మళ్లీ చెలరేగిపోతున్నారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి, ఫ్రస్టేషన్ తో అంబటి ప్రెస్ మీట్లు పెట్టి టైమ్ వేస్ట్ చేసుకుంటున్నారని, ఎప్పుడైనా ఇంత శ్రద్ధగా పోలవరం గురించి ప్రెస్ మీట్ పెట్టారా అని ప్రశ్నిస్తున్నారు. ఏపీలోని సాగునీటి ప్రాజెక్ట్ ల వివరాల గురించి తెలియని అంబటి, 'బ్రో' కలెక్షన్ల లెక్కలు మాత్రం బాగా గుర్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

First Published:  1 Aug 2023 5:40 PM IST
Next Story