Telugu Global
Andhra Pradesh

సింపతీ వస్తుందని మాకు తెలియదా..? అయినా తప్పలేదు

గతంలో చంద్రబాబు తనపై కేసులు వేశారు, ఏం పీకారంటూ సెటైర్లు వేసేవారని, ఇప్పుడు అన్ని ఆధారాలున్నాయి కాబట్టే సీఐడీ వాళ్లు పీకారని ఎద్దేవా చేశారు మంత్రి అంబటి రాంబాబు.

సింపతీ వస్తుందని మాకు తెలియదా..? అయినా తప్పలేదు
X

చంద్రబాబుని అరెస్ట్ చేస్తే సింపతీ వస్తుందని మాకు తెలియదా..? అయినా అరెస్ట్ తప్పలేదు అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదని, అనివార్యం అని తేల్చి చెప్పారు. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు నడుచుకున్నా శిక్ష తప్పదని అన్నారు. అరెస్టు వల్ల సింపతీ వస్తుందని టీడీపీ, ఎల్లోమీడియా అనుకున్నాయని, కక్షసాధింపుగా ప్రజలు చూస్తారని భావించారని, కానీ అవేవీ జరగలేదని అన్నారు అంబటి.


భారీగా అక్రమాలు చేసినా చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగానికి విలువ ఏముంటుందని ప్రశ్నించారు అంబటి. సీఐడీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వలన కేసుకు అనుగుణంగా వారు వ్యవహరించారని చెప్పారు. ఇలాంటి ముద్దాయిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే అన్యాయం, అక్రమం, కక్షసాధింపు అంటూ టీడీపీ గగ్గోలు పెట్టడం హాస్యాస్పదం అన్నారు. నేరస్తుడిని భయపడి వదిలేస్తే రాజ్యాంగం, ప్రజలు, చట్టాలు క్షమించవు అన్నారు అంబటి.

అప్పుడే అయిపోలేదు..

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోచుకున్నందుకే చంద్రబాబు ఇప్పుడు అరెస్టు అయ్యారని తేల్చి చెప్పారు మంత్రి అంబటి రాంబాబు. స్కిల్ కేసులో ఇప్పుడు అరెస్టు అయ్యారని.. ఇంకా రింగు రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ విచారణ జరుగుతుందని తెలిపారు. చంద్రబాబు స్కామ్ లో ఇరుక్కున్నవారు ఇద్దరు పరారయ్యారని చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు ముందు చాలా లోతైన విచారణ జరిగిందన్నారు అంబటి. షెల్ కంపెనీలకు డబ్బు తరలించి, తర్వాత తన ఖాతాలోకి వేసుకున్నట్టు తేలిందని పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీతో సంబంధం లేకుండానే వ్యవహారం నడిపారన్నారు. ఆ కంపెనీ కూడా ఈ విషయం చెప్పిందని, రూ.330 కోట్ల ప్రజాధనాన్ని దోచుకొని లూటీ చేశారని విమర్శించారు. ఈ కేటాయింపుల్ని అప్పటి ఆర్థిక శాఖ అధికారులు, చీఫ్ సెక్రటరీ ఎవరూ ఒప్పుకోలేదని, కానీ చంద్రబాబు తన జేబులో వేసుకోడానికి ఆ కేటాయింపులు జరిపారని చెప్పారు.

ఆధారాలున్నాయి కాబట్టే పీకారు..

గతంలో చంద్రబాబు తనపై కేసులు వేశారు, ఏం పీకారంటూ సెటైర్లు వేసేవారని, ఇప్పుడు అన్ని ఆధారాలున్నాయి కాబట్టే సీఐడీ వాళ్లు పీకారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే ఆందోళనలకు దిగుతామంటూ పవన్ కల్యాణ్ లాంటివాళ్లు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేస్తామని హెచ్చరించారు అంబటి.

చంద్రబాబు అరెస్ట్ పై బీజేపీ స్పందన హాస్యాస్పదం అన్నారు మంత్రి అంబటి. తనకు బంధువు అని పురంద్రీశ్వరి చంద్రబాబుకి మద్దతుగా మాట్లాడారా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు అక్రమాలపై విమర్శలు చేసిన బీజేపీ, జనసేన ఇప్పుడు ఆయనకు మద్దతు తెలపడమేంటని అడిగారు అంబటి. చంద్రబాబే కాదు, లోకేష్ కూడా జైలుకెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు.

First Published:  9 Sept 2023 2:01 PM IST
Next Story