పవన్ గురించి గాలిమేడలు కట్టొద్దు - కాపులకు మంత్రి అంబటి రాంబాబు సూచన
పవన్ అంత అసమర్థుడు, అబద్ధాలకోరు ఎవరూ లేరని మంత్రి అంబటి విమర్శించారు. అలాగే చంద్రబాబు అంత మోసగాడు దేశంలోనే ఎవరూ లేరని చెప్పారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకే పవన్ తాపత్రయపడుతున్నాడని తెలిపారు.

పవన్ కల్యాణ్ గురించి కాపులు గాలిమేడలు కట్టొద్దని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. రాజకీయాల్లో టార్గెట్ ముఖ్యమంత్రి కావడమేనని.. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కి మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే టార్గెట్ అని ఆయన ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తాజాగా చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రస్తావించిన అంశాలపై పొలిటికల్ పంచ్‌లు విసిరారు.
ఈయన అసమర్థుడు.. ఆయన మోసగాడు..
పవన్ అంత అసమర్థుడు, అబద్ధాలకోరు ఎవరూ లేరని మంత్రి అంబటి విమర్శించారు. అలాగే చంద్రబాబు అంత మోసగాడు దేశంలోనే ఎవరూ లేరని చెప్పారు. చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకే పవన్ తాపత్రయపడుతున్నాడని తెలిపారు. పవన్ పార్టీ పెట్టిందే చంద్రబాబు కోసమని అంబటి చెప్పారు. పవన్ జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ ఒక్క సీటులో కూడా పోటీ చేయలేదని, తనకు సీఎం పదవి వద్దు.. తాను అడగనని చెప్పారని గుర్తుచేశారు.
ముమ్మాటికీ ప్యాకేజీ స్టారే...
పవన్ కల్యాణ్ ముమ్మాటికీ ప్యాకేజీ స్టారేనని మంత్రి అంబటి స్పష్టం చేశారు. ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయాడని చెప్పారు. ప్యాకేజీ స్టార్ కాకపోతే చంద్రబాబును ఎందుకు కలుస్తున్నారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు వద్ద ఊడిగం చేసే స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. పిచ్చి మాటలతో జనసేన కార్యకర్తలను, కాపులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
రెండేళ్ల క్రితమే చెప్పాం...
టీడీపీ, జనసేన కలిసి బరిలోకి దిగుతాయని తాము రెండేళ్ల క్రితమే చెప్పామని అంబటి రాంబాబు చెప్పారు. వారాహిని రద్దు చేసుకుని షెడ్డులో పెట్టుకున్నప్పుడే జనానికి ఆ విషయం అర్థమైందని వివరించారు. చంద్రబాబు సిగ్నల్ ఇస్తే తప్ప వారాహి బయటికి రాదని చెప్పారు. జనసేన, టీడీపీ సింగిల్‌గా వచ్చినా.. కలిసొచ్చినా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు.