Telugu Global
Andhra Pradesh

బాబు చేత, బాబు వల్ల, బాబుకోసం..

ఏపీలో పొత్తుల విషయంలో గందరగోళం ఉందని.. లెఫ్ పార్టీలు బీజేపీతో కలవబోవని, బీజేపీ.. చంద్రబాబుని నమ్మడంలేదని, కానీ పవన్ మాత్రం లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలన్నిటినీ కలపాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు అంబటి.

బాబు చేత, బాబు వల్ల, బాబుకోసం..
X

పవన్ కల్యాణ్, చంద్రబాబు రాజకీయంపై రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు మంత్రి అంబటి రాంబాబు. 8 పేజీల లేఖను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయం అంతా బాబు చేత, బాబు వల్ల, బాబు కోసం.. అనే విషయాన్ని ప్రజలు గమనించాలని ఆ లేఖలో కోరారు మంత్రి అంబటి. పొత్తు అనేది కేవలం పవన్ రాజకీయ ఎత్తు మాత్రమేనన్నారు అంబటి.

ఆ పర్యటన అందుకోసమే..

పవన్ కల్యాణ్ ఇటీవల రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించి రైతులను పరామర్శించడానికి అసలు కారణం వేరే ఉందని చెప్పారు అంబటి. బాబుతో మరోసారి రాజకీయ వివాహ బంధానికి వేదిక రెడీ చేయటానికే పవన్ జనంలోకి వచ్చారన్నారు.

లెఫ్ట్-రైట్-సెంటర్..

ఏపీలో పొత్తుల విషయంలో గందరగోళం ఉందని.. లెఫ్ పార్టీలు బీజేపీతో కలవబోవని, బీజేపీ.. చంద్రబాబుని నమ్మడంలేదని, కానీ పవన్ మాత్రం లెఫ్ట్, రైట్, సెంటర్ పార్టీలన్నిటినీ కలపాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు అంబటి. చంద్రబాబుకోసం తాను వారందర్నీ వదులుకోక తప్పదని తెలిసే పొత్తు ప్రతిపాదనలు చేశారన్నారు.

దత్త పుత్రుడు.. దత్త తండ్రి..

చంద్రబాబు బీజేపీతో తెగతెంపులు చేసుకునే సమయంలో పవన్ కూడా ముందు జాగ్రత్తగా బీజేపీకి దూరం జరిగారని గుర్తు చేశారు మంత్రి అంబటి. "బీజేపీ మన రాష్ట్రాన్ని పొట్టలో పొడిచింది, పాచి లడ్డూలు ఇచ్చింది, రాష్ట్రాన్ని విడగొట్టి బీజేపీ సృష్టించిన సమస్యలు చాలు. ఉత్తరాదికి దక్షిణాది వారు బానిసలు కారు. ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయబోతున్నాను." అంటూ అప్పట్లో పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్లు ఇచ్చారని చెప్పారు అంబటి. ఆనాడు దత్త తండ్రి కోసం దత్త పుత్రుడు బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారని, ఇప్పుడు మరోసారి చంద్రబాబు కోసమే పొత్తు రాజకీయాలు తెరపైకి తెస్తున్నారని చెప్పారు అంబటి. చంద్రబాబు, పవన్.. అవకాశవాద రాజకీయాలను ప్రజలు గుర్తించాలని అన్నారు.

First Published:  14 May 2023 9:33 AM IST
Next Story