నన్ను తిట్టలేదని సాయం ఎగ్గొట్టిన వ్యక్తి చంద్రబాబు- అంబటి
హామీ ఇచ్చిన చంద్రబాబు దివ్యాంగురాలు లక్ష్మీకి వాహనం గానీ, డబ్బు గానీ పంపించలేదన్నారు. ఆమెకు ఫోన్ చేసి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారని.. ఆమె రాలేనని చెప్పడంతో డబ్బులు, వాహనం ఇవ్వకుండా వదిలేశారన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. ఇటీవల సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబునాయుడు.. గుండ్లపాలెం గ్రామంలో నిర్వహించే సభకు జనం లేకపోవడంతో మార్గమధ్యలో ఎస్సీ కాలనీకి వెళ్లారని అక్కడ లక్ష్మీ అనే దివ్వాంగురాలికి ఒక వాహనంతో పాటు లక్ష రూపాయల నగదు ఇస్తానని, మరో అమ్మాయిని పలకరించి నిన్ను చదివించే బాధ్యత నాదీ అని చంద్రబాబు హామీ ఇచ్చారని అంబటి వివరించారు. పక్కనే సోడా కొట్టులో సోడా తాగి అక్కడ ఐదు వేలు ఇచ్చారన్నారు.
హామీ ఇచ్చిన చంద్రబాబు దివ్యాంగురాలు లక్ష్మీకి వాహనం గానీ, డబ్బు గానీ పంపించలేదన్నారు. ఆమెకు ఫోన్ చేసి మంగళగిరి టీడీపీ కార్యాలయానికి రావాల్సిందిగా సూచించారని.. ఆమె రాలేనని చెప్పడంతో డబ్బులు, వాహనం ఇవ్వకుండా వదిలేశారన్నారు. చదివిస్తానని హామీ ఇచ్చిన అమ్మాయి తండ్రికి ఫోన్ చేసి టీడీపీలో చేరుతారా అని అడిగారని, అతడు అందుకు నిరాకరించడంతో వారికి కూడా సాయం చేయలేదని అంబటి వివరించారు. కేవలం టీడీపీలో చేరే వారికి, జగన్ ప్రభుత్వాన్ని తిట్టేవారికే చంద్రబాబు సాయం చేస్తున్నారని అంబటి విమర్శించారు. డబ్బులు ఇచ్చి తిట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
గతంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో గంగమ్మ అనే మహిళ కుమారుడు సెప్టిక్ ట్యాంకులో పడి చనిపోతే ప్రభుత్వం ఇచ్చిన ఎక్స్‌గ్రేషియాలో తాను సగం అడిగానంటూ ఆమెతో ఆరోపణలు చేయించారని.. ఆమె ఆ ఆరోపణలు చేసినందుకు గాను పవన్ కల్యాణ్ నాలుగు లక్షలు, చంద్రబాబు రెండు లక్షలు ఇచ్చారని గుర్తు చేశారు. గంగన్న అన్న కుమారుడు కూడా అదే రోజు చనిపోయారని.. కానీ ఆ యువకుడి కుటుంబం తనపై ఆరోపణలు చేయకపోవడంతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అంబటి గుర్తు చేశారు. కేవలం ప్రభుత్వంపైకి అమాయక ప్రజలను రెచ్చగొట్టాలనే చంద్రబాబు పనిచేస్తున్నారని.. అలా ప్రభుత్వంపై రెచ్చిపోయే వారికి మాత్రమే డబ్బు ఇస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.