Telugu Global
Andhra Pradesh

పోలవరంపై కంగారేం లేదు.. తప్పంతా టీడీపీదే –అంబటి

మానవ తప్పిదం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కి చాలా నష్టం జరిగిందంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పోలవరంపై కంగారేం లేదు.. తప్పంతా టీడీపీదే –అంబటి
X

పోలవరం విషయంలో డెడ్ లైన్లు పెట్టి ఇబ్బంది పడటం వైసీపీకి ఇష్టం లేదని అర్థమైపోయింది. జలవనరుల శాఖ మాజీ మంత్రి అనిల్, తాజా మంత్రి అంబటి గతంలో డెడ్ లైన్లు పెట్టి బుక్కయ్యారు. ఇప్పుడిక కంగారేం లేదని అంటున్నారు మంత్రి అంబటి. తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన ఆయన, అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

తప్పంతా టీడీపీదే..

గత ప్రభుత్వ తొందరపాటు చర్యల వల్లే పోలవరానికి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు మంత్రి అంబటి. నిపుణుల బృందాలు ప్రాజెక్ట్ పనులను పూర్తి స్థాయిలో పరిశీలించాయని, గతేడాది వచ్చిన వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ బాగా దెబ్బతిన్నదని అంచనాకు వచ్చాయన్నారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రాంతంలో పెద్దపెద్ద అగాధాలు ఏర్పడ్డాయన్నారు అంబటి. గత వరదల్లో 485 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నట్టు తేలిందని చెప్పారు. కేంద్ర బృందాలు డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించాయని, అక్కడ నిర్మాణాలు చేపట్టాల్సి ఉందన్నారు. త్వరలోనే డయాఫ్రమ్ వాల్ మరమ్మతులు చేపడతామని అన్నారు అంబటి.

నాలుగు నెలలు కీలకం..

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో వచ్చే నాలుగు నెలలు చాలా కీలకం అంటున్నారు అంబటి. ఈ సీజన్ లో ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయ్యే రోజు కోసం.. రాష్ట్ర ప్రజలు ఎంతగానో వేచి చూస్తున్నారని చెప్పారాయన.

చర్యలు తప్పవు..

మానవ తప్పిదం వల్ల పోలవరం ప్రాజెక్ట్ కి చాలా నష్టం జరిగిందంటున్నారు మంత్రి అంబటి రాంబాబు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం తమకు పనులు త్వరగా పూర్తి చేయాలనే కంగారు లేదని, అతి జాగ్రత్తగా పనులు పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎప్పటికైనా సీఎం జగన్ చేతుల మీదుగానే పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని చెప్పారు.

First Published:  5 March 2023 12:29 PM IST
Next Story