వారసత్వంపై అంబటి వ్యాఖ్యలు.. సొంత పార్టీ నేతలపైనే సెటైర్లా..?
సడన్‌గా అంబటి రాంబాబు వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వారసులకు ప్రజల మద్దతు కూడా అవసరం అని అంబటి అన్నారు.
రాజకీయాల్లో వారసత్వం ఉండదు.. ప్రజల మద్దతు లేకుండా కేవలం వారసత్వంతోనే రాజకీయాల్లో రాణిస్తాం అనుకుంటే పొరపాటేనని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. తాను ఈ వ్యాఖ్యలను నారా లోకేష్‌ని ఉద్దేశించి చేశానని చెప్పుకొచ్చారాయన. నారా లోకేష్ పరిస్థితే దీనికి ఉదాహరణ అని ఎద్దేవా చేశారు. వారసుడిగా రాణించలేదు కాబట్టే, లోకేష్‌ను చంద్రబాబు దొడ్డి దారిన మంత్రిని చేశాడని ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలు సొంత పార్టీ వారిని కూడా టార్గెట్ చేసినట్టు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలింతకీ సొంత పార్టీ వారిని అంబటి ఎందుకు టార్గెట్ చేశారు...?
ఇటీవల ఎమ్మెల్యేలతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన ఆరా తీశారు. ఎవరెవరు బాగా పనిచేస్తున్నారు. ఎవరెవరు తప్పించుకు తిరుగుతున్నారంటూ లెక్కతీసి మరీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో వారసుల విషయంలో కూడా ఆయన ఎమ్మెల్యేలకు ఓ క్లారిటీ ఇచ్చారు. ఈసారికి వారసులకు సీట్లు ఇచ్చేది లేదని, పాతవారే పోటీ చేయాలని సూచించారు. మాజీ మంత్రి పేర్ని నాని బదులు ఆయన తనయుడు కిట్టు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే కొడుకు తిరగడం కాదని, ఎమ్మెల్యే హోాదాలో నాని కూడా గడప గడపకు వెళ్లాలని చెప్పారు జగన్. ఇదే ఉదాహరణ అందరికీ వర్తిస్తుందని అన్నారు.
ఒకరకంగా జగన్ వ్యాఖ్యలతో చాలామంది నాయకులు ఇబ్బంది పడుతున్నారు. వచ్చేసారి కొడుకునో లేక కూతురినో, లేక దగ్గరి బంధువులనో తన బదులు బరిలో దింపాలని చాలామంది నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. వారంతా జగన్ దెబ్బకు సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సడన్‌గా అంబటి రాంబాబు వారసత్వ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. వారసులకు ప్రజల మద్దతు కూడా అవసరం అని అంబటి అన్నారు. నారా లోకేష్ వరకే ఈ వ్యాఖ్యలు పరిమితమా లేక పార్టీలకతీతంగా ఇతర నాయకులకు కూడా ఇవి వర్తిస్తాయా అనేది అంబటికే తెలియాలి.