Telugu Global
Andhra Pradesh

సిగ్గులేకుండా.. కంచాలు మోగిస్తారా?

చంద్రబాబును అరెస్టు చేసింది రాష్ట్ర సీఐడీ అన్నది ఎంత నిజమో, కోర్టులు తిరస్కరించటం వల్లే చంద్రబాబు ఈరోజు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారన్నది కూడా అంతే నిజమని స్పష్టం చేశారు.

సిగ్గులేకుండా.. కంచాలు మోగిస్తారా?
X

అవినీతికి పాల్పడి, అడ్డంగా దొరికిపోయినా సిగ్గులేకుండా కంచాలు మోగిస్తామంటున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సిగ్గుపడాల్సిన పనులు చేసి.. ప్రజల ముందు తలదించుకోవాల్సిన చోట కూడా తల ఎగరేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేతల అహంకారాన్ని ప్రజలు మరింత అణచాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. 2014 నుంచి 2019 వరకు మోగించిన అవినీతి మోత కారణంగానే చంద్రబాబుకు ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. ఐదేళ్లు అడ్డంగా తినేసిన బకాసురులంతా కలిసి కంచాలు ఎవరి మీద మోగిస్తున్నారు? విజిళ్లు ఎవరి మీద ఊదుతారు? హారన్లు ఎవరిని ఉద్దేశించి కొడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్టు చేసింది రాష్ట్ర సీఐడీ అన్నది ఎంత నిజమో, కోర్టులు తిరస్కరించటం వల్లే చంద్రబాబు ఈరోజు రిమాండ్‌ ఖైదీగా ఉన్నారన్నది కూడా అంతే నిజమని స్పష్టం చేశారు.

మీరు మోత మోగించేది ఇందుకేనా?

ఈ సందర్భంగా మంత్రి అంబటి టీడీపీ నేతలకు పలు ప్రశ్నలు సంధించారు.

సీఎం జగన్‌ తన నాలుగేళ్ల పాలనలో పేదలకు డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌) ద్వారా రూ.2.35 లక్షల కోట్లు బదిలీ చేస్తే.. అదే స్థాయిలో బడ్జెట్, నిధులు ఉన్నా ఆ సొమ్మంతా టీడీపీ హయాంలో ఉఫ్‌ అని ఊదేసినందుకు గుర్తుగా టీడీపీ వారంతా విజిళ్లు ఊదుతారా? అంటూ ప్రశ్నించారు.

♦ అవినీతి చేసి హైదరాబాద్‌ నుంచి పారిపోయి వచ్చి, బస్సులో పడుకున్నానని ఆడిన డ్రామాలకు గుర్తుగా హారన్లు మోగిస్తారా? అని నిలదీశారు.

♦ చంద్రబాబు అవినీతిని ఈడీ కూడా నిర్ధారించి నలుగురిని అరెస్టు చేసిందని, కాబట్టి.. ఢిల్లీలో దాక్కున్న లోకేశ్‌ ఆ ఈడీ ఆఫీసు ముందు నిలబడి, ఇది అక్రమం అని కంచాలు కొడితే బాగుంటుందని పేర్కొన్నారు.

♦ రాష్ట్రపతి, మోడీ, అమిత్‌ షా కార్యాలయాల ముందు నిలబడి, తమ ఎంపీలు, పురందేశ్వరి, సీపీఐ నారాయణ, రామకృష్ణ, రేవంత్‌రెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, రేణుకాచౌదరి, కూనంనేని సాంబశివరావు, బీవీ రాఘవులు, జయప్రకాష్‌ నారాయణ, వీళ్లందరినీ ఢిల్లీలో నిలబెట్టుకుని ఈడీ అరెస్టు అక్రమమని, స్కిల్‌ స్కామే లేదని కంచాలు కొడితే బాగుంటుందని తెలిపారు. విజిల్స్‌ ఊదితే ఇంకా బాగుంటుందని, హారన్లు కొడితే మరింత బాగుంటుందని ఎద్దేవా చేశారు.

♦ కేంద్ర ఆర్థికమంత్రి ఇంటి ముందు, ప్రధానమంత్రి ఇంటి ముందు, ఢిల్లీలోని ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం ముందు కూడా బాబుకు మద్దతిచ్చే వారంతా కంచాలు, గిన్నెలు, తపాళాలు, గరిటెలు, గ్లాసులు అన్నీ తీసుకెళ్లి కొడితే బాగుంటుందని పేర్కొన్నారు.

♦ వీలుంటే నల్ల చొక్కాలతో ప్రదర్శన చేసి, వాట్‌ అయామ్‌ సేయింగ్‌.. అంటూ గతంలో కొట్టిన డైలాగులను రిపీట్‌ చేస్తే బాగుంటుందని మంత్రి అంబటి తెలిపారు.

First Published:  30 Sept 2023 8:23 AM IST
Next Story