Telugu Global
Andhra Pradesh

పోలవరం దైవ నిర్ణయం -అసెంబ్లీలో అంబటి

పోలవరం ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్‌ అనే పేరు ఉంటుందన్నారు మంత్రి అంబటి. పోలవరం ఎప్పటికైనా పూర్తి చేసేది తామేనని, తమ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని, అది దైవ నిర్ణయం అని చెప్పారు.

పోలవరం దైవ నిర్ణయం -అసెంబ్లీలో అంబటి
X

పోలవరం నిర్మాణం దైవాధీనం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కేంద్రం నిధులివ్వదు, రాష్ట్రం దగ్గర ఖర్చులకు డబ్బులు లేవు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ లేకుండా పోలవరంపై హడావిడి చేసింది గత ప్రభుత్వం, వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్ టెండరింగ్ పేరుతో జరిగిన హడావిడి మినహా మిగతా పురోగతి పెద్దగా లేదు. జలవనరుల శాఖ మంత్రులుగా వస్తున్నవారంతా డెడ్ లైన్లు పెట్టి, సవాళ్లు విసిరారు కానీ పని మాత్రం పూర్తి కాలేదు, 2024 సార్వత్రిక ఎన్నికలలోపు పూర్తవుతుందనే ఆశ కూడా ఎవరికీ లేదు. ఈ దశలో ఏపీ అసెంబ్లీలో పోలవరంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి అంబటి రాంబాబు. పోలవరం ఎప్పటికైనా పూర్తి చేసేది తామేనని, తమ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని, అది దైవ నిర్ణయం అని చెప్పారు.

మొదట్లో శ్రీరామపాద సాగర్‌ అని పేరుతో ప్రాజెక్ట్ మొదలైందని, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ గా మార్చారని చెప్పుకొచ్చారు అంబటి. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిచే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని భావించి ఆనాడు వైఎస్సార్‌ జలయజ్ఞం ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రాజెక్టు శంకుస్థాపనతోపాటు అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్సారేనని అన్నారు. ఏపీకి చాలామంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్సార్‌ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారని వివరించారు.

పోలవరం ప్రతి నీటి బొట్టుపై వైఎస్సార్‌ అనే పేరు ఉంటుందన్నారు మంత్రి అంబటి. పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ. 2,600 కోట్ల పెండింగ్‌ నిధులు కేంద్రం నుంచి రావాలని చెప్పారు. చంద్రబాబు ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్నారని, కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ ను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో 48 శాతం వరకే పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరాన్ని తామే నిర్మాస్తామని చంద్రబాబు ఎందుకు అన్నారో ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ తప్పిదం వల్ల రూ.2022 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని, దాన్ని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు అంబటి.

First Published:  23 March 2023 4:29 PM IST
Next Story