Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేడు

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాగా దిట్ట అని, దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారని ఆయన తెలిపారు. ఫైబర్‌ నెట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారని, తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు

చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేడు
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చట్టం నుంచి తప్పించుకోలేడని ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో బాబు అడ్డంగా దొరికిపోయాడని ఆయన చెప్పారు. తాజాగా సుప్రీంకోర్టు చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై ఇచ్చిన తీర్పులోనూ బాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.

గుంటూరులో బుధవారం మంత్రి అంబటి విలేకరులతో మాట్లాడుతూ.. దొరకని దొంగలా ఇన్నాళ్లూ చెలామణి అయిన చంద్రబాబు.. స్కిల్‌ స్కామ్‌ కేసులో అడ్డంగా దొరికిపోయారని విమర్శించారు. స్కిల్‌ స్కామ్‌లో చంద్రబాబు రూ.371 కోట్లు లూటీ చేసినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపిందని గుర్తుచేశారు. అయినా చంద్రబాబు ఆర్థిక బలంతో చట్టం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబును తీవ్ర నిరాశకు గురిచేసిందని అంబటి తెలిపారు. హైకోర్టులో కూడా 17 ఏ ప్రకారం చంద్రబాబును అరెస్ట్‌ చేయడం తప్పంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదించారని గుర్తుచేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లారని తెలిపారు. ఈ కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు.. వంద కారణాలు చెప్పి బెయిల్‌ తెచ్చుకున్నారని మంత్రి విమర్శించారు.

చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో బాగా దిట్ట అని, దుర్మార్గమైన కార్యక్రమాలు చేశారని ఆయన తెలిపారు. ఫైబర్‌ నెట్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులోనూ వందల కోట్లు కాజేశారని, తెలంగాణలో ఓటుకు నోటు కేసులో కూడా అడ్డంగా బుక్కయ్యారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీని ఓడించే సత్తా లేక చంద్రబాబు ప్రతి ఒక్కరితో పొత్తు పెట్టుకుంటున్నారని ఆయన విమర్శించారు. అయితే ప్రజలకు చంద్రబాబు అవినీతి అర్థమైందని మంత్రి చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ కూడా అవినీతిపరుడేనని, చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీకి అనుగుణంగా పవన్‌ ఆయనకు మద్దతిస్తుంటాడని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, రామోజీరావు వైట్‌ కాలర్‌ క్రిమినల్స్‌ అని అంబటి విమర్శించారు.

First Published:  18 Jan 2024 7:12 AM IST
Next Story