బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తా.. ఏపీ మంత్రి వెరైటీ ప్రచారం
ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఎన్నికల ప్రచారాన్ని బుల్లెట్ పైనే ఎక్కువశాతం నిర్వహించాలని ఆయన డిసైడ్ అయ్యారు.
మంత్రి అంబటి రాంబాబు ఈ దఫా ఎన్నికల్లో వెరైటీ ప్రచారానికి తెరతీశారు. బుల్లెట్టు బండిపై తిరుగుతూ ఆయన ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఆల్రడీ ట్రయల్ రన్ నిర్వహించారు. బుల్లెట్టు బండెక్కి సత్తెనపల్లి పుర వీధుల్లో చక్కర్లు కొట్టారు. టీ స్టాల్ కి వెళ్లారు, టిఫిన్ కొట్టు వద్ద ఆగారు, చిరు వ్యాపారులతో కలసి వారి పనుల్లో సహాయం చేస్తూ సందడి చేశారు. జనాలకు మరింత దగ్గరవ్వాలంటే ఇలా సామాన్యుడిగానే వారి మధ్యలోకి వెళ్లాలంటున్నారు మంత్రి అంబటి. ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో ఎన్నికల ప్రచారాన్ని బుల్లెట్ పైనే ఎక్కువశాతం నిర్వహించాలని ఆయన డిసైడ్ అయ్యారు.
వైరి వర్గానికి అడుగడుగునా కౌంటర్లు ఇస్తూ మాటల తూటాలు పేల్చే మంత్రి అంబటి రాంబాబు, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే ఉంటారు. ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆయన మందీమార్బలం అన్నీ పక్కనపెట్టారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా బుల్లెట్ బండి వాడేందుకు ఆయన సిద్ధమయ్యారు. బైక్ పై వెళ్తే ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందని, పేద, మధ్యతరగతి వర్గానికి దగ్గరవ్వాలంటే ఇదే సరైన పద్ధతి అని అంటున్నారు అంబటి.
బైక్ పై వెళ్తుంటే స్థానికులను కలవడం, వారి సమస్యలు వినడం కూడా సులభంగా ఉన్నట్లు మంత్రి అంబటి తన అభిమానులతో చెప్పారు. కొత్త బుల్లెట్ బండికి మాదలలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేయించారు. ఈ బుల్లెట్ పైనే ఆయన ప్రచార పర్వంలో ఎక్కువ భాగం పూర్తి చేస్తారని తెలుస్తోంది. సత్తెనపల్లి నియోజవకర్గంలో నకరికల్లు, రాజుపాలెం, ముప్పాళ్ల, సత్తెనపల్లి రూరల్ మండలాలు ఉన్నాయి. రూరల్ గ్రామాల్లో బుల్లెట్ బండికి క్రేజ్ ఉంది. దీంతో ఆయన ఆ బండిపైనే గ్రామాల్లోకి కూడా వెళ్లాలని ఫిక్స్ అయ్యారు.