Telugu Global
Andhra Pradesh

ఆ రాయి ప్రజల గుండెలపై పడినట్టే.. పవన్ కి అంబటి కౌంటర్

దేశంలోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు సీఎం జగన్ అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు సింపతీ అవసరమేంటని ప్రశ్నించారు.

ఆ రాయి ప్రజల గుండెలపై పడినట్టే.. పవన్ కి అంబటి కౌంటర్
X

జగన్ కి చిన్న రాయి తగిలితే రాష్ట్రానికి ఏదో జరిగినట్టు బాధపడిపోతున్నారంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి అంబటి రాంబాబు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 151 గెల్చుకుని అధికారంలోకొచ్చిన జనాదరణ కలిగిన నాయకుడు జగన్‌కు గాయం అయితే తెలుగు ప్రజలకు గాయమైనట్లు కాదా..? అని ప్రశ్నించారు. ఆ రాయి జగన్ పై కాదని, తమ గుండెలపై పడినట్టు ప్రజలు భావించారని, అందుకే అలా ప్రతిస్పందించారని చెప్పారు. ఏది నాటకమో, ఏది నిజమో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న పవన్, చంద్రబాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమాధి తప్పదని జోస్యం చెప్పారు అంబటి.

జనసేన అభ్యర్థి మనోహర్‌ గెలిస్తే తెనాలి సర్వనాశనమేనని అన్నారు మంత్రి అంబటి. రాజకీయ పరిజ్ఞానం లేని తిక్కలోడు పవన్‌కల్యాణ్‌ అని ఎద్దేవా చేశారు. పవన్‌ ప్రసంగాలన్నీ బూతులేనని, బూతులు మాట్లాడే నేతల్ని పిఠాపురం ప్రజలు శాసనసభకు ఎందుకు పంపుతారని ప్రశ్నించారు. పవన్ కి అసెంబ్లీకి వెళ్లే యోగం లేదని, ఈసారి కూడా ఆయనకు ఓటమి తప్పదని అన్నారు. 21 సీట్లు తీసుకున్నప్పుడే పవన్ కల్యాణ్ ఓటమి ఖాయమైపోయిందని, జనసేన కార్యకర్తలు కూడా ఆయనకు ఓటు వేయబోరని చెప్పారు అంబటి.

దేశంలోకెల్లా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు సీఎం జగన్ అని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఆయనకు సింపతీ అవసరమేంటని ప్రశ్నించారు. జగన్‌ అధికారంలో ఉన్నంతకాలం ఆర్థిక అక్రమాలకు అవకాశం లేదనే కారణంతో చంద్రబాబు వర్గీయులు తమ నాయకుడిపై కక్షగట్టి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం వైసీపీకి ఉందని చెప్పారు. కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, జగన్‌కు వస్తున్న ప్రజాదరణను చూసి ఆయన్ని హత్యచేయడానికి చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈసారి తమ నాయకుడిపై రాయిగానీ, మరొకటేదైనా పడితే రాష్ట్ర ప్రజలు చంద్రబాబును క్షమించరని హెచ్చరించారు మంత్రి అంబటి.

First Published:  16 April 2024 2:54 AM GMT
Next Story