Telugu Global
Andhra Pradesh

ఇప్పటికైనా మేలుకో.. పార్టీలో మీసం తిప్పు.. - బాలయ్యకు అంబటి సలహా

చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు సరైన ఫార్మాట్లో చర్చ పెట్టకుండా గందరగోళం సృష్టించారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

ఇప్పటికైనా మేలుకో.. పార్టీలో మీసం తిప్పు.. - బాలయ్యకు అంబటి సలహా
X

టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇప్పటికైనా మేలుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. ఆయన మీసం తిప్పాల్సింది అసెంబ్లీలో కాదని, తెలుగుదేశం పార్టీలో అని చెప్పారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని అక్కడ మీసం తిప్పండి.. అని అంబటి అన్నారు. `జన్మనిచ్చిన తండ్రికి క్లిష్ట సమయంలో అండగా నిలవలేదనే అపవాదు మీ మీద, మీ అన్నదమ్ముల మీద ఉంది.. దానిని తొలగించుకునే అవకాశం ఇప్పుడొచ్చింది.. పోయిన పగ్గాలు తీసుకోండి.. నందమూరి వంశాన్ని నిరూపించుకోండి.. పార్టీని బతికించుకోండి..` అంటూ సూచించారు. పార్టీని సర్వనాశనం చేసుకునే పరిస్థితి తెచ్చుకోకండని చెప్పారు. మీ బావ జైల్లో.. అల్లుడు ఢిల్లీలో ఉన్నారు. ఇదే మీకు సరైన సమయం.. అని చెప్పారు. తాను సలహా మాత్రమే ఇస్తున్నానని, పాటిస్తే పాటించవచ్చన్నారు.

అసెంబ్లీ సమావేశాల రెండోరోజైన శుక్రవారం నాడు అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద అంబటి మాట్లాడారు. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ నేతలు సరైన ఫార్మాట్లో చర్చ పెట్టకుండా గందరగోళం సృష్టించారని విమర్శించారు. చంద్రబాబు అవినీతిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈరోజైనా సరైన ఫార్మాట్లో చర్చకు రావాలని కోరుతున్నామన్నారు.

చిత్తశుద్ధి ఉంటే రండి చర్చిద్దాం.. మీ వాదనలను మీరు వినిపించండి.. మా వాదనలు మేం వినిపిస్తాం.. చంద్రబాబు అవినీతి చేయలేదని మీకు నమ్మకం ఉంటే.. చంద్రబాబు తప్పు చేయలేదని మీరు నిజంగా నమ్మితే చర్చలో పాల్గొనండి, పారిపోవద్దు.. అని అంబటి సూచించారు. అసెంబ్లీలో నిన్న తాను లేచి నిలబడకపోతే స్పీకర్‌ మీద దాడి చేసేవారని తెలిపారు. పేపర్‌ లో వార్తల కోసం టీడీపీ వ్యవహరించినట్లుగా అనిపిస్తోందని విమర్శించారు. ఈరోజు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే స్పీకర్‌ కచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.

First Published:  22 Sept 2023 11:11 AM IST
Next Story