Telugu Global
Andhra Pradesh

స్కిల్ కేసులో కొట్టేసినదానికంటే.. లాయర్ల ఫీజే ఎక్కువంట..!

చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య కొత్తదేమీ కాదని, ఆయనకు చాన్నాళ్ల క్రితమే ఆ వ్యాధి వచ్చిందన్నారు అంబటి రాంబాబు. దాని గురించి అందరికీ తెలుసని, ఆయన ఎప్పటినుంచో మందులు కూడా వాడుతున్నారని గుర్తు చేశారు.

స్కిల్ కేసులో కొట్టేసినదానికంటే.. లాయర్ల ఫీజే ఎక్కువంట..!
X

స్కిల్ కేసులో చంద్రబాబు కొట్టేసినదానికంటే.. ఆయన బెయిల్ కోసం వాదిస్తున్న లాయర్లకు ముడుతున్న ఫీజు ఎక్కువైపోతోందంటూ సెటైర్లు పేల్చారు మంత్రి అంబటి రాంబాబు. వ్యవస్థలను మేనేజ్ చేసిన చంద్రబాబు.. చివరకు జైలులో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. వ్యవస్థల్ని చక్కగా మేనేజ్ చేసినన్నాళ్లూ ఆయన బయట ఉన్నారని, ఇప్పుడు ఆయన జైలుకి వెళ్లడంతో కొడుక్కి ఆ పని సరిగా రాలేదని, అందుకే బాబు బయటకు రాలేకపోతున్నారని చెప్పారు. బాబు ఒక్కరోజు బయటకొచ్చినా, ఆయన కేసుల వ్యవహారం నుంచి తప్పించుకోగల సమర్థుడని, అందుకే ఆయనకు కోర్టులు కూడా బెయిలివ్వడంలేదని అన్నారు అంబటి.


అదేమీ కొత్త సమస్య కాదు..

చంద్రబాబుకి చర్మ సంబంధిత సమస్య కొత్తదేమీ కాదని, ఆయనకు చాన్నాళ్ల క్రితమే ఆ వ్యాధి వచ్చిందన్నారు అంబటి రాంబాబు. దాని గురించి అందరికీ తెలుసని, ఆయన ఎప్పటినుంచో మందులు కూడా వాడుతున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు కొత్తగా ఆ వ్యాధి వచ్చిందని, డీహైడ్రేషన్ అని, అలర్జీ అని, దద్దుర్లు అని రాద్ధాంతం చేస్తారెందుకని ప్రశ్నించారు అంబటి. చంద్రబాబు ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే ముందే ఏసీ పెట్టించాలంటూ కోర్టుని అడాగాలి కదా అని అన్నారు.

చంద్రబాబు ఆరోగ్యం విషమం అని కొత్త ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబటి. చంద్రబాబు ఇంటి నుంచి వచ్చే ఆహారంలో స్టెరాయిడ్స్ ఎవరు కలిపి ఇస్తున్నారో చెప్పాలన్నారు. అసలు చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయం డాక్టర్లు చెప్పాలని, టీడీపీ నాయకులు కాదన్నారు అంబటి. ఎన్టీఆర్ ను వెన్ను పోటు పొడిచిన యనమల, చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జైలుకు వెళ్లిన తర్వాత చంద్రబాబు బరువు తగ్గ లేదని, కిలో బరువు పెరిగారని అన్నారు. చంద్రబాబు ఏసీ అడిగిన గంటలో కోర్టు అనుమతి ఇచ్చిందని, ఆస్పత్రికి తరలించాలంటే ఆ నిర్ణయం కూడా కోర్టు తీసుకుంటుందని చెప్పారు. చంద్రబాబు ఖరీదైన లాయర్లను పెట్టుకున్నా.. బెయిల్ ఎందుకు రావడం లేదో టీడీపీ కార్యకర్తలు ఆలోచించాలని అన్నారు మంత్రి అంబటి రాంబాబు.

First Published:  15 Oct 2023 5:11 PM IST
Next Story