దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధం..?
దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధమని మంత్రి అమర్ ప్రశ్నించారు. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు అనేక ఫోన్ కాల్స్ మాట్లాడే అవకాశం ఉంటుందని, అవన్నీ వీరికి ఎందుకు ఇస్తారని నిలదీశారు.
నారా లోకేష్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాడని, ఆయన నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారంటూ లోకేష్ చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. వ్యవస్థలను మేనేజ్ చేసే అలవాటు తమకు లేదని, బాబుకి, లోకేష్‌కే ఆ అలవాటు ఉందని చెప్పారు.
సీఐడీ పోలీసుల కాల్‌డేటా ఇవ్వలేదని చేసిన ఆరోపణలపై స్పందిస్తూ..
దొంగలకు పోలీసుల కాల్ డేటాతో ఏం సంబంధమని మంత్రి అమర్ ప్రశ్నించారు. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు అనేక ఫోన్ కాల్స్ మాట్లాడే అవకాశం ఉంటుందని, అవన్నీ వీరికి ఎందుకు ఇస్తారని నిలదీశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుల్లో టీడీపీ వాదనలు.. వాటి ఫలితాలు అందరూ చూశారని మంత్రి చెప్పారు. ఇప్పటికే చంద్రబాబును జైలులో ఉంచి 50 రోజులు పూర్తయ్యాయని, ఏం ఆధారాలు చూపించారని ప్రశ్నించడంపై స్పందిస్తూ.. రుజువులు మీకు ఎందుకు చూపిస్తారు.. కోర్టులకు ఇస్తారని మంత్రి చెప్పారు.
మీ తండ్రి చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా చూపించామని తెలిపారు. సీమెన్స్ సంస్థ మాకు, ఆ ఒప్పందానికి సంబంధం లేదని స్పష్టంగా చెప్పిందన్నారు. 130 నుంచి 140 మంది వాంగ్మూలం కూడా ఇచ్చారని తెలిపారు. రూ. 371 కోట్ల రాష్ట్ర ప్రజల సొమ్ము మీ తండ్రి చంద్రబాబు కొట్టేశారు.. దొంగ దొరికిన తర్వాత ఎంతకాలమైనా జైల్లో ఉంటారు.. అంటూ మంత్రి స్పష్టం చేశారు. న్యాయస్థానంలో చంద్రబాబు తరఫు న్యాయవాదులు 17–ఏ గురించి మాట్లాడుతున్నారు తప్ప.. ఆయన తప్పు చేయలేదని అనడం లేదని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.
టీడీపీకి అనుబంధ విభాగంలా ఏపీ బీజేపీ..
బీజేపీ ఏపీ విభాగం టీడీపీకి అనుబంధ విభాగంలా పనిచేస్తోందని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. పురందేశ్వరి బీజేపీ నాయకురాలుగా కాకుండా, చంద్రబాబును కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. టీడీపీ ఒకపక్క బీజేపీకి కన్ను కొడుతూ.. మరోపక్క కాంగ్రెస్‌కి కన్ను కొడుతూ.. డబుల్‌గేమ్ ఆడుతోందన్నారు. బాలకృష్ణ పార్టీని స్వాధీనం చేసుకుంటారనే భయంతోనే ఆయన్ని పక్కన పెట్టారని మంత్రి విమర్శించారు. అందుకే ఆయన సినిమాలు పూర్తిచేసుకునే పనిలో నిమగ్నమయ్యారని చెప్పారు. పూర్తి అభద్రతా భావంతో ఉన్నది చంద్రబాబు, లోకేషేనని ఈ సందర్భంగా ఆయన విమర్శించారు. చంద్రబాబు తప్పు చేశారు కాబట్టే.. 50 రోజులపాటు జైలులో ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు.