మూడు రాజధానులే 2024 ఎన్నికల రెఫరెండం..
మూడు రాజధానులు అనే అంశం 2024 ఎన్నికల రెఫరెండమేనని స్పష్టం చేశారు మంత్రి అమర్నాథ్. ఆ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో అయినా అమరావతికి ముగింపు కార్డ్ పడుతుందని చెప్పారాయన.
మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కారు వెనక్కి తగ్గేలా లేదు. ఇటు అమరావతే ఏకైక రాజధాని కావాలంటూ రైతులు పాదయాత్ర పార్ట్-2ని తెరపైకి తెస్తే.. అటు మూడు రాజధానులకోసం ప్రభుత్వం త్రీ క్యాపిటల్ బిల్లు సెకండ్ ఎపిసోడ్ ని సిద్ధం చేస్తోంది. కచ్చితంగా అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు పెడతామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈసారి ఎవరూ అడ్డుకోలేరని, న్యాయస్థానాలు కూడా ఆక్షేపణ చెప్పకుండా పకడ్బందీగా వస్తున్నామని అన్నారు.
రెఫరెండమే..
మూడు రాజధానులు అనే అంశం 2024 ఎన్నికల రెఫరెండమేనని స్పష్టం చేశారు మంత్రి అమర్నాథ్. ఆ ఎన్నికల్లో ప్రజా తీర్పుతో అయినా అమరావతికి ముగింపు కార్డ్ పడుతుందని చెప్పారాయన. ఏళ్ల తరబడి వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకోవాలని ఓ దండు మన ప్రాంతానికి బయలుదేరిందని, వారిని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రైతుల యాత్ర దేవుడిని చూడడానికయితే ఎవరికీ ఇబ్బంది లేదని, కానీ తమ ప్రాంతానికి వచ్చి ఇది అభివృద్ధి చెందకూడదని మొక్కుతామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయి తీరుతుందని స్పష్టం చేశారు.
మూడు రాజధానులు కావాలనుకునేవారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్ష ఉన్నవారు 2024లో వైసీపీకి పట్టం కడతారన్నారు అమర్నాథ్. విశాఖలో ప్రభుత్వ భవనాలు నిర్మించకూడదా అని ప్రశ్నించారు. వైసీపీ మూడు రాజధానులు ప్రకటించిన తర్వాత ఏపీలో స్థానిక ఎన్నికలు, కొన్నిచోట్ల ఉప ఎన్నికలు వచ్చాయని.. అన్నిట్లో వైసీపీయే తిరిగి గెలిచిందని.. 2024లో కూడా అదే అజెండాతో ముందుకెళ్లినా విజయం తమదేనన్నారు అమర్నాథ్. కేవలం చంద్రబాబు తన సామాజిక వర్గం కోసం చేయిస్తోన్నదే అమరావతి యాత్ర అని, అందులో నిజమైన రైతులెవరూ లేరని విమర్శించారు. విద్వేష ప్రసంగాలతో రెచ్చగొట్టాలని చూస్తే తాము ఊరుకోబోమని చెప్పారు.