'బాబా'.. బాబుగారి బానిస
కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఎవరికీ భయం లేదన్నారు మంత్రి అమర్నాథ్. కేంద్రానికి కాకపోతే బైడన్ కో, పుతిన్ కో చెప్పుకో అని కౌంటర్ ఇచ్చారు. కేంద్రం దగ్గర పవన్ కు పలుకుబడి లేదని, ఆయకు ఉన్నదల్లా చంద్రబాబు దగ్గర రాబడి అని అన్నారు.
దత్త పుత్రుడు, ప్యాకేజ్ స్టార్.. అంటూ ఇన్నాళ్లూ పవన్ కల్యాణ్ ని విమర్శిస్తున్న వైసీపీ నేతలు, ఇప్పుడు మరో కొత్త పేరు కనిపెట్టారు. పవన్ కల్యాణ్ 'బాబా' అని అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 'బాబా' కి అర్థం కూడా ఆయన చెప్పారు. 'బాబా' అంటే బాబుగారి బానిస అని సెటైర్లు పేల్చారు మంత్రి.
పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పార్ట్-3 ని విశాఖ నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. యాత్రకు ముందు కూడా మంత్రి గుడివాడ పంచ్ డైలాగులు విసిరారు. అది యాత్ర కాదని, వెబ్ సిరీస్ అని అన్నారు. విశాఖ జగదాంబ సెంటర్ బహిరంగ సభ తర్వాత కూడా మంత్రి గుడివాడ అమర్నాథ్.. పవన్ కల్యాణ్ పై విమర్శలు ఎక్కుపెట్టారు. వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారంటూ పవన్ చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సినిమా పరిశ్రమలో ఉన్న మహిళల గురించి విమర్శలు వచ్చినప్పుడు నోరు మెదపని పవన్, ముద్రగడ భార్య, కోడలిని చంద్రబాబు ఇబ్బంది పెట్టినప్పుడు నోరు తెరవని పవన్.. ఇప్పుడు రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు.
గంజాయి మత్తులో ఉన్నాడా..?
పవన్ వ్యాఖ్యలు వింటే, గంజాయి మత్తులో ఆయన మాట్లాడుతున్నారనే అనుమానం వస్తోందని చెప్పారు మంత్రి గుడివాడ అమర్నాథ్. విశాఖలో భూ దోపిడీ, గంజాయి రవాణాపై.. టీడీపీ ఉన్నప్పుడే ఆరోపణలు వచ్చాయని, అప్పుడు పవన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రాష్ట్రంలో నూటికి 95శాతం పథకాల్లో మహిళలే లబ్ధిదారులని, దాన్ని పవన్ వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం ఆదాయం సంక్షేమం కోసం అని పవన్ అంటున్నారంటే.. ఆయన మహిళల్ని కించపరిచినట్టేనని చెప్పారు
అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను అనే వేమన సూక్తి పవన్ కల్యాణ్ కి కరెక్ట్ గా సరిపోతుందన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. యువరాజ్యం అధ్యక్షుడు నుంచి ఇప్పటివరకు గత 15 ఏళ్లలో సిద్ధాంతం, స్థిరత్వం, విధానం లేని వ్యక్తి పవన్ అని విమర్శించారు. సంసారం బీజేపీతో, సహజీవనం టీడీపీతో.. ఇదే పవన్ విధానమని ఎద్దేవా చేశారు. పవన్ పొలిటికల్ ప్రొడ్యూసర్ చంద్రబాబు అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. బానిస బ్రతుకు బ్రతుకుతున్న పవన్ వెంట నడుస్తున్న కార్యకర్తలను చూసి జాలేస్తుందన్నారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తే ఎవరికీ భయం లేదన్నారు మంత్రి అమర్నాథ్. కేంద్రానికి కాకపోతే బైడన్ కో, పుతిన్ కో చెప్పుకో అని కౌంటర్ ఇచ్చారు. కేంద్రం దగ్గర పవన్ కు పలుకుబడి లేదని, ఆయకు ఉన్నదల్లా చంద్రబాబు దగ్గర రాబడి అని అన్నారు మంత్రి అమర్నాథ్.