Telugu Global
Andhra Pradesh

గురువు, గూగుల్.. ఇరకాటంలో మంత్రి

వాస్తవానికి మంత్రి ఆదిమూలపు సురేష్ గూగుల్ ప్రస్తావన తేకుండా ఉండాల్సింది, కానీ తెచ్చారు. అది ట్రోల్ అయింది, దీంతో నాలుక కరచుకున్న మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

గురువు, గూగుల్.. ఇరకాటంలో మంత్రి
X

"గూగుల్ ఉండగా ఇక గురువులతో పనేముంది." అనే మాట ఇటీవల కాలంలో చాలా చోట్ల వినపడుతోంది. గతంలో గురువుల ద్వారా విజ్ఞానం లభించేది, ఇప్పుడంతా గూగుల్ లో దొరుకుతోంది అనే అర్థంతో దీన్ని వినియోగిస్తున్నారు. ఇలాంటి మాటలు సరదాకి బాగుంటాయేమో కానీ, బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న నాయకుడు, ఇటీవల వరకు విద్యాశాఖ నిర్వహించిన అమాత్యులు అంటే మాత్రం బాధగా ఉంటుంది. ఏపీలో టీచర్స్ డే రోజు అదే జరిగింది. ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నోరు జారారు. గురువు, గూగుల్ అనే పోలిక తెచ్చారు. సోషల్ మీడియాలో ఈ వ్యవహారంపై విపరీతంగా ట్రోలింగ్ నడిచింది. దీంతో మంత్రి దిగిరాక తప్పలేదు. ఓ సుదీర్ఘ వివరణతో ప్రెస్ మీట్ పెట్టి మరీ కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.

అబ్బెబ్బే నేనలా అనలేదు..

టీచర్స్ డే రోజు మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యలు విన్న అందరికీ.. ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అనిపించే ఉంటుంది. వాస్తవానికి మంత్రి గూగుల్ ప్రస్తావన తేకుండా ఉండాల్సింది, కానీ తెచ్చారు. అది ట్రోల్ అయింది, దీంతో నాలుక కరచుకున్న మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. తన తల్లిదండ్రులు టీచర్లు అని, తనకు టీచర్లంటే దైవంతో సమానం అంటూ చెప్పుకొచ్చారు. గూగుల్ గురించి ప్రస్తావించాను కానీ.. ఇప్పుడున్న టెక్నాలజీతో టీచర్లు పోటీ పడాలని మాత్రమే తాను చెప్పానన్నారు. తానెక్కడా టీచర్లను కించపరచలేదని, అదంతా కొంతమంది కావాలని చేసిన కుట్ర అని తేల్చేశారు. తనపై బురదజల్లేందుకే తన మాటల్ని వక్రీకరించారన్నారు.

అడుసు తొక్కనేల..

సోషల్ మీడియా కాలంలో ప్రతి మాట ఆచితూచి మాట్లాడాల్సిందే. అంతా బాగానే మాట్లాడినా అవసరం ఉన్నంత వరకు కట్ చేసుకుని ఎడిట్ చేసి ట్రోల్ చేస్తున్న రోజులివి. అలాంటి రోజుల్లో గూగుల్ తో గురువుకి పోలిక పెట్టి మాట్లాడిన మంత్రి, నేనలా అనలేదు అంటే ఎవరు నమ్ముతారు. మంత్రి మనసులో గురువుల్ని కించపరిచే ఉద్దేశం ఉండకపోవచ్చు. కానీ ప్రసంగంలో గూగుల్ తో గురువు పోలిక తెచ్చారు కాబట్టి ఆయనపై ఆ అపవాదు పడింది. దాన్ని కవర్ చేసుకోలేక మళ్లీ తన మంచితనం గురించి ఆయన చెప్పుకోవాల్సి వచ్చింది. పనిలో పనిగా జగన్ ప్రభుత్వం గురువులకు ఎంత మేలు చేసిందో కూడా ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలే టీచర్లు సీపీఎస్ సహా ఇతర వ్యవహారాలతో ప్రభుత్వంపై రగిలిపోతున్నారు. ఈ దశలో మంత్రి నోరుజారి కొత్తగా తిప్పలు కొనితెచ్చుకున్నారు.

First Published:  7 Sept 2023 7:25 AM IST
Next Story