Telugu Global
Andhra Pradesh

వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ లు.. ఏపీ మంత్రి సంచలన కామెంట్లు

ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా అరెస్ట్ లు జరుగుతున్నాయి. అయినా కూడా వైసీపీ మంత్రి చట్టం తనపని తాను చేసుకు పోతోందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు.

వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్ట్ లు.. ఏపీ మంత్రి సంచలన కామెంట్లు
X

వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ తాజాగా ఇద్దరిని అరెస్ట్ చేసింది. అందులో ఒకరు స్వయానా కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, మరొకరు అవినాష్ రెడ్డి సన్నిహితుడు ఉదయ్ కుమార్ రెడ్డి. ఈ రెండు అరెస్ట్ ల తర్వాత వైసీపీ నుంచి ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. గతంలో అయితే వైసీపీ.. నేరుగా సీబీఐనే టార్గెట్ చేసింది. చంద్రబాబుకి సీబీఐ, ఎన్ఐఏ లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని, వాటి ద్వారానే ఆయన కేసుల విచారణలో జోక్యం చేసుకోగలుగుతున్నారని ఆరోపించారు వైసీపీ నేతలు. సీబీఐ ప్రతిపక్షాలతో చేతులు కలిపి అవినాష్ రెడ్డిని వేధిస్తోందని కూడా వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. అయితే ఈ రెండు అరెస్ట్ ల తర్వాత మంత్రి ఆదిమూలపు సురేష్ మాత్రం కాస్త ఆసక్తికరమైన సమాధానమిచ్చారు. చట్టం తనపని తాను చేసుకుపోతోందని చెప్పారాయన.

చట్టం తనపని అంటే..!!

తమకి అనుకూలంగా అరెస్ట్ లు జరుగుతుంటే.. సహజంగా ఎవరైనా చట్టం తనపని తాను చేసుకుపోతోంది అంటూ భారీ స్టేట్ మెంట్లు ఇస్తారు. అయితే ఇక్కడ వైసీపీకి వ్యతిరేకంగా అరెస్ట్ లు జరుగుతున్నాయి. అయినా కూడా వైసీపీ మంత్రి చట్టం తనపని తాను చేసుకు పోతోందన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తేల్చి చెప్పారు. దోషులు ఎవరైనా బయటకు రావాల్సిందేనని అన్నారు. అసలు ఆ కేసుని సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది సీఎం జగనే కదా అని ప్రశ్నించారు మంత్రి సురేష్. అంటే సీబీఐ అరెస్ట్ లను ఆయన సమర్థిస్తున్నారనే అనుకోవాలి. చట్టానికి ఎవరూ అతీతులు కాదు అంటున్న మంత్రి సురేష్.. అవినాష్ రెడ్డి అయినా, ఆయన తండ్రి అయినా తప్పు చేస్తే అరెస్ట్ కావాల్సిందేనని పరోక్షంగా చెప్పినట్టే లెక్క.

మరి గొడవలెందుకు..?

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే పులివెందులలో భాస్కర్ రెడ్డి అరెస్ట్ సందర్భంగా అంత గొడవ ఎందుకు చేశారనేది తేలాల్సి ఉంది. వైసీపీ నేతలు ఆయన అరెస్ట్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. భాస్కర్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి అనుకూలంగా వైసీపీ నేతలు నినాదాలు చేశారు. అరెస్ట్ సరికాదంటూ అడ్డుకున్నారు. అవినాష్ రెడ్డి, ఆయన వర్గం కూడా అరెస్ట్ లను తీవ్రంగా ఖండించింది. పులివెందుల బ్యాచ్ రియాక్షన్ అలా ఉంటే, ఇక్కడ మంత్రి ఆదిమూలపు సురేష్ రియాక్షన్ మాత్రం మరోలా ఉంది.

First Published:  16 April 2023 10:36 AM GMT
Next Story