Telugu Global
Andhra Pradesh

ఏపీలో పాల సేకరణ ధర పెంపు

ఇప్పుడు మరోసారి అమూల్‌ పాల సేకరణ ధరలను పెంచింది. గేదె పాలపై లీటర్‌కు గరిష్టంగా రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున పెంచారు. కనిష్టంగా గేదె పాలపై రూ. 2.26, ఆవు పాలపై రూ. 0.11 మేర పెంపు ఉంటుంది.

ఏపీలో పాల సేకరణ ధర పెంపు
X

ఏపీలో అమూల్‌ రాకముందు ప్రైవేట్‌ డెయిరీలు జిల్లాలను పంచుకుని మరీ పాడి రైతులను దోచుకున్నాయన్న ఆరోపణలున్నాయి. రైతులకు తక్కువ ధర చెల్లిస్తూ కంపెనీలు మాత్రం భారీగా లాభాలు అర్జించాయి. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలోకి అమూల్‌ను తీసుకురావడంతో పోటీతత్వం అమాంతం పెరిగింది. అమూల్‌ రాకను అడ్డుకునేందుకు ప్రైవేట్ డెయిరీలు, మీడియా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశాయి. కానీ ప్రభుత్వం గట్టిగా నిలబడటంతో అమూల్‌ ప్రాజెక్టు ముందుకే సాగింది. అమూల్‌ రావడంతోనే అధిక ధరను చెల్లించడం మొదలుపెట్టింది. దాంతో ప్రైవేట్ డెయిరీలు కూడా తప్పనిసరిగా పాల సేకరణ ధరను పెంచాల్సి వచ్చింది.

ఇప్పుడు మరోసారి అమూల్‌ పాల సేకరణ ధరలను పెంచింది. గేదె పాలపై లీటర్‌కు గరిష్టంగా రూ.4.51, ఆవు పాలపై రూ.1.84 చొప్పున పెంచారు. కనిష్టంగా గేదె పాలపై రూ. 2.26, ఆవు పాలపై రూ. 0.11 మేర పెంపు ఉంటుంది. కిలో వెన్నకు రూ.32 పెంచి చెల్లించనున్నారు. ఈ పెంపు రాయలసీమ పరిధిలో తక్షణం అమలులోకి వస్తుందని అమూల్‌ ప్రకటించింది. దాదాపు 65వేల మంది పాడి రైతులకు ఈ ధరల పెంపుతో మేలు జరుగుతుంది.

జగనన్న పాల వెల్లువ స్కీం మొదలైన తర్వాత పాడి రైతులకు చెల్లించే ధరలను ఏడుసార్లు పెంచారు. ప్రస్తుతం గేదె పాలకు గరిష్టంగా రూ. 84. 26, ఆవు పాలకు రూ. 42.27 చెల్లిస్తున్నారు. పెరిగిన ధరలతో రాయలసీమ పరిధిలో గేదె పాల సేకరణ ధర రూ. 87.77కి చేరుతుంది.

ప్రస్తుతం జగనన్న పాల వెల్లువ స్కీంలోకి 2.96 లక్షల మంది పాడి రైతులు భాగస్వాములయ్యారు. 3,549 గ్రామాల్లో పాల సేకరణ జరుగుతోంది.

First Published:  11 Jun 2023 7:43 AM IST
Next Story