Telugu Global
Andhra Pradesh

తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న మిచౌంగ్..

తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

తీవ్ర వాయుగుండంగా కొనసాగుతున్న మిచౌంగ్..
X

మిచౌంగ్ తుపాను తమిళనాడు, ఏపీలో విధ్వంసం సృష్టించి తీరం దాటింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం ప్రభావం కనపడుతోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అల్లూరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. ఏపీలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి గంటకు 45 కి.మీల వేగంతో గాలులు వీస్తాయని చెప్పారు. ఏపీ తీరం వెంబడి మత్స్యకారులు ఈరోజు కూడా చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలో అంధకారం..

నెల్లూరు నగరంతోపాటు, జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు అవస్థ పడుతున్నారు. నగరంలో ఈరోజు కూడా చాలా ప్రాంతాల్లో కరెంటు లేదు. కూలిపోయిన చెట్లు, పడిపోయిన స్తంభాలను తొలగిస్తూ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అటు విద్యాసంస్థలకు కూడా సెలవలు పొడిగించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని విద్యా సంస్థలకు బుధవారం కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్ కుమార్, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌.. జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్ లో టూవీలర్లపై ఆంక్షలు విధించారు. నడక మార్గంలో కూడా భక్తులకు పలు జాగ్రత్తలు సూచించారు. దుర్గగుడి ఘాట్ రోడ్డు కూడా మూసివేశారు. వర్షాలు తగ్గేవరకూ ఘాట్ రోడ్డు మూసి ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు అధికారులు. భక్తులు కనకదుర్గ నగర్ మార్గం ద్వారా రావాలని సూచించారు. గోదావరి, కోనసీమ జిల్లాల్లో ఈరోజు కూడా వర్షాలు కురుస్తున్నాయి. పంటనష్టం అంచనా వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పునరావాస కేంద్రాల్లోనుంచి వెళ్లేవారికి తక్షణ సాయం అందించాలని ఇప్పటికే సీఎం జగన్ ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా నిధులు కూడా విడుదల చేశారు.

First Published:  6 Dec 2023 9:58 AM IST
Next Story