పాఠశాల విద్యాశాఖలోకి మోడల్ స్కూళ్ల సిబ్బంది విలీనం - పదేళ్ల సమస్యకు పరిష్కారం
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్‌కు ఇకపై ‘010’ పద్దు ద్వారా ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది కల నెరవేరింది. వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాఠశాల విద్యాశాఖలోకి మోడల్ స్కూళ్ల సిబ్బందిని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మోడల్ స్కూళ్ల సిబ్బంది పదేళ్ల కల పరిష్కారమైంది.
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్‌కు ఇకపై ‘010’ పద్దు ద్వారా ట్రెజరీ నుంచి వేతనాలు చెల్లించనున్నారు. 2009లో ఏర్పాటైన మోడల్ స్కూల్స్ సొసైటీ కింద 164 స్కూళ్లు పనిచేస్తున్నాయి. వీటిలో 3,260 మంది ప్రిన్సిపల్స్‌గా, పీజీటీ, టీజీటీలుగా సేవలు అందిస్తున్నారు. ఇన్నాళ్లూ వీరికి వివిధ పద్దుల కింద వేతనాలు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో తమకు కూడా విద్యాశాఖలోని ఉపాధ్యాయులతో సమానంగా ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ద్వారా వారి పదేళ్ల కోరికను నెరవేర్చింది.