Telugu Global
Andhra Pradesh

ఎవరు మారాలి..? ఎందుకు మారాలి..? పాలాభిషేకాలు మళ్లీ మొదలు

ప్రభుత్వం చేసే పనులకు ప్రచారం ఉండాలి, కానీ అది మరీ శృతి మించి, పాలాభిషేకాలు ఎక్కువైతే మాత్రం మొదటికే మోసం వస్తుంది.

ఎవరు మారాలి..? ఎందుకు మారాలి..? పాలాభిషేకాలు మళ్లీ మొదలు
X

వైసీపీ హయాంలో ప్రభుత్వం ఏ పథకం ప్రకటించినా, కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నా.. అప్పటి సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు జరిగేవి. సచివాలయాల ఉద్యోగులు రెగ్యులర్ అయినప్పుడు, వాలంటీర్లకు అవార్డులు ప్రకటించినప్పుడు ఈ హడావిడి మరింత ఎక్కువగా కనపడింది. డ్వాక్రా మహిళలు, చేయూత లబ్ధిదారులు, పెన్షన్లు పెంచినప్పుడు వృద్ధులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల వారు జగన్ చిత్రపటానికి పాలాభిషేకాలు చేసిన ఉదాహరణలు కోకొల్లలు. అభిషేకాలు చేసి మరీ జగన్ తమ గుండెల్లో ఉన్నారని ఒట్టుపెట్టినవారంతా పోలింగ్ రోజు ఆ ఒట్టుతీసి గట్టునపెట్టారు. ప్రభుత్వం మారింది కానీ జనాలకు ఆ అలవాటు మాత్రం మారలేదు. ఇప్పుడు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి.

గతంలో ఉద్యోగ ప్రకటనలు విడుదలైతే నిరుద్యోగులు సంతోషపడేవారే కానీ, సంబరాలు చేసుకునేవారు కాదు. కానీ ఇప్పుడు మాత్రం అన్నీ ప్రచార ఆర్భాటాలుగా మారాయి. మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు తొలి సంతకం పెట్టగానే ఇక్కడ నిరుద్యోగులు సంబరాలు చేసుకుంటున్నారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో చంద్రబాబు, పవన్, లోకేష్ ఫొటోలకు పాలాభిషేకాలు చేశారు. ఎస్వీ యూనివర్శిటీ పరిపాలనా భవనం ముందు క్షీరాభిషేకాలు మొదలయ్యాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం అంటూ విద్యార్థులు, నిరుద్యోగులు నినాదాలు చేశారు.

ప్రచారం ఎక్కువైతే..?

ప్రభుత్వం చేసే పనులకు ప్రచారం ఉండాలి, కానీ అది మరీ శృతి మించి, పాలాభిషేకాలు ఎక్కువైతే మాత్రం మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వం ఏది చేసినా ఆహా ఓహో అనేవారి మాటలే కాదు, సునిశిత విమర్శలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. జయము జయము చంద్రన్నా అంటూ పోలవరం దగ్గర పాడిన భజన పాటలు ఇంకా జనాలు మరచిపోలేదు. అదే సీన్ రిపీట్ అయితే మాత్రం ఇప్పుడు పాలాభిషేకాలు చేసిన చేతులే రేపు ఈవీఎంల దగ్గర మొరాయించడం ఖాయం.

First Published:  14 Jun 2024 2:50 PM IST
Next Story