Telugu Global
Andhra Pradesh

బాబుకు షాక్.. విజయనగరంలో కీలక నేత గుడ్‌బై

విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ తనకు పైడితల్లమ్మ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పారన్నారు.

బాబుకు షాక్.. విజయనగరంలో కీలక నేత గుడ్‌బై
X

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో 30 రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ, ప్రతిపక్ష టీడీపీకి మాత్రం అసంతృప్తులు ఇంకా షాకులు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పగా.. మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్నారు.

తాజాగా విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పారు. చంద్రబాబు, లోకేష్‌ తనకు పైడితల్లమ్మ సాక్షిగా ఇచ్చిన మాటను తప్పారన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వనప్పటికీ, టీడీపీ ప్రభుత్వం రానప్పటికీ పార్టీని వీడిపోలేదన్నారు గీత. ప్రోటోకాల్ లేకుండా సామాన్య కార్యకర్తను పిలిచినట్లు పిలిచినప్పటికీ పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యానని గుర్తు చేసుకున్నారు. కానీ ఈ సారి కూడా టికెట్ ఇవ్వకుండా తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు గీత. మే 13న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయనగరం నుంచి అందరి ఆత్మగౌరవం నినాదంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు మీసాల గీత.


2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓడిపోయిన గీత.. తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం గూటికి చేరారు. 2014లో విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గీతకు టికెట్ నిరాకరించిన చంద్రబాబు.. అశోక్‌ గజపతి రాజు కూతురు ఆదితి విజయలక్ష్మికి టికెట్ ఇచ్చారు. ఐనప్పటికీ గీత పార్టీని వీడలేదు. పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ వచ్చారు. ఈ సారి కూడా టికెట్ విషయంలో మొండిచేయి చూపడంతో గీత తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అవమానాల మధ్య తాను టీడీపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు గీత. కార్యకర్తలు, అనుచరులు, ప్రజలు కోరిక మేరకు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. ఇక గీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. ఆ ప్రభావం టీడీపీ మీద పడుతుందని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.

First Published:  16 April 2024 8:21 AM IST
Next Story