Telugu Global
Andhra Pradesh

అక్కడ మాయావతి.. ఇక్కడ షర్మిల

మాయావతి, షర్మిలను అడ్డు పెట్టుకుని బీజేపీ నీఛ రాజకీయాలకు తెరతీసింది. ఇండియా కూటమిని దెబ్బకొట్టేందుకు కుటిల వ్యూహాలు పన్నింది.

అక్కడ మాయావతి.. ఇక్కడ షర్మిల
X

మోదీ హ్యాట్రిక్, బీజేపీకి 400కి పైగా స్థానాలు.. అని ఆ పార్టీ ధీమాగా చెబుతోందంటే దాని వెనక చాలా కారణాలున్నాయి. కాషాదయళం నీఛ రాజకీయాలనే నమ్ముకుంది. ఇండియా కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నింది, తెర వెనక రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రాల వారీగా కొన్ని పార్టీలు, పార్టీల అధినేతలు బీజేపీకి కొమ్ముకాస్తున్నారు, ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ లో మాయావతి పూర్తిగా బీజేపీకి లాభం చేకూర్చేలా తన గేమ్ ప్లాన్ అమలు చేశారు. బీఎస్పీ తరపున ముస్లింలకు అత్యథికంగా సీట్లు కేటాయించారు. కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎస్పీ అభ్యర్థులే టార్గెట్ గా బీఎస్పీ అభ్యర్థులు ఓట్లు చీల్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలున్నాయి. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ అక్కడ 13 స్థానాల్లో, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) 67 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఎస్పీకి అనుకూలంగా ఉన్న యాదవ సామాజిక వర్గ ఓట్లు, బీజేపీ వ్యతిరేక ముస్లిం ఓట్లు తమను గట్టెక్కిస్తాయని కూటమి అంచనా వేసింది. కూటమి తరపున 11మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. కానీ వారు అనుకున్నదొకటి, అయింది మరొకటి. ఇండియా కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తూ మాయావతి ముస్లింలకు అత్యథికంగా సీట్లు కేటాయించారు. బీఎస్పీ ఈసారి ఏకంగా 18మంది ముస్లింలకు సీట్లిచ్చింది. వీరిలో గెలుపు అవకాశాలున్నవారు చాలా తక్కువమంది. కానీ వీరి టార్గెట్ ఒక్కటే. ఇండియా కూటమికి వచ్చే ఓట్లను చీల్చి, పరోక్షంగా బీజేపీకి సాయపడటం. ఆ లోపాయికారీ ఒప్పందం ప్రకారమే యూపీ రాజకీయాలు కాంగ్రెస్ కి ప్రతికూలంగా మారాయి.

ఇక్కడ షర్మిల..

యూపీలో మాయావతి బీజేపీకి లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తుంటే, ఏపీలో షర్మిల ఆ పాత్ర పోషిస్తున్నారు. అదేంటి ఏపీసీసీ అధ్యక్షురాలు బీజేపీకి ఎందుకు మద్దతిస్తారని కొందరికైనా అనుమానం రావొచ్చు. కానీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇక్కడ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ. అందుకే ఆమె వైసీపీకి వెన్నుపోటు పొడిచేలా, చంద్రబాబుకి మేలు జరిగేలా ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు.

యూపీలో 80 లోక్ సభ సీట్లలో మాయావతి ముస్లింలకు 18 సీట్లు కేటాయించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లలో 17 సీట్లు ముస్లిం అభ్యర్థులకు కేటాయించారు షర్మిల. కాంగ్రెస్ తోపాటు వామపక్షాల అభ్యర్థులు కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. వీరి టార్గెట్ మాత్రం ఒక్కటే, వైసీపీ ఓటు బ్యాంక్ ని నిట్టనిలువునా చీల్చేయాలి, టీడీపీ కూటమి అభ్యర్థులకు మేలు చేయాలి. ఇది బీజేపీ మైండ్ గేమ్.

పక్కా ఆధారాలు..

కడపలో డిప్యూటీ సీఎం అంజాద్ భాషాకు పోటీగా ముస్లిం అభ్యర్థి అలీ ఖాన్ కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ నుంచి రెడ్డప్పగారి మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్లను కాంగ్రెస్ అభ్యర్థి చీల్చితే అక్కడ టీడీపీ అభ్యర్థి లాభపడే అవకాశముంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్య పోటీ టగ్ ఆఫ్ వార్ లా మారింది. దీంతో ఇక్కడ కాంగ్రెస్ నిలబెట్టిన ముస్లిం అభ్యర్థి గణనీయంగా ఉన్న ఆ వర్గం ఓట్లను వైసీపీకి వెళ్లకుండా చేస్తున్నారు. కర్నూలులో వైసీపీ ఇంతియాజ్ అహ్మద్ కి టికెట్ ఇస్తే, కాంగ్రెస్ జిలానీ భాషాను తెరపైకి తెచ్చింది. ఓట్లు చీలితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ లాభపడే అవకాశముంది. వైసీపీలో కొందరు కీలక నేతల్ని టార్గెట్ చేసి మరీ ముస్లిం అభ్యర్థుల్ని తెరపైకి తెచ్చారు షర్మిల. ఏకంగా 17మందికి టికెట్లు ఇచ్చి పోటీకి నిలబెట్టారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కాంగ్రెస్ కి ఏపీలో గెలుపు అవకాశాలు లేవు కాబట్టి.. ఆమె లోపాయికారీగా టీడీపీ కూటమికి అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. షర్మిల నిలబెట్టిన 17మంది ముస్లిం అభ్యర్థుల్లో ఎవరికీ గెలిచే ఛాన్స్ లేదు. కానీ గణనీయంగా ముస్లిం ఓట్లను మాత్రం వారు చీల్చే అవకాశముంది. దాని ద్వారా టీడీపీ కూటమికి లాభం చేకూరడమే షర్మిల మాస్టర్ ప్లాన్. మాయావతి, షర్మిల.. ఇలాంటి వారందర్నీ అడ్డు పెట్టుకుని ఈసారి బీజేపీ నీఛ రాజకీయాలు మొదలు పెట్టింది.

First Published:  28 April 2024 9:11 AM IST
Next Story