వైజాగ్ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసినా.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.
విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 40కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరట కలిగించే అంశం. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి ఒక బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి క్రమేపీ పక్కనే ఉన్న బోట్లకూ విస్తరించాయి.
సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేసినా.. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దాదాపు 40కి పైగా బోట్లు మంటలకు ఆహుతయ్యాయి. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత ఆందోళనకు గురయ్యారు. ఆ తర్వాత ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలియడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సమాచారం అందుకున్న పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.