పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు - ముగ్గురు మృతి!
ఏపీలోని పశ్చిమగోదావరిజిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో ఓ బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.ఈ సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ముగ్గురు మృతి చెందారు.
తాడేపల్లిగూడెం మండలం కడియద్ద గ్రామంలో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురి శరీరాలు తునాతునకలయ్యాయి.
పేలుడు దుర్ఘటనలో కాకినాడ జిల్లా జగ్గంపేటకు చెందిన యాళ్ల ప్రసాద్, రొయ్యల స్వామి, నాగిరెడ్డి నాని మృతి చెందారు. నల్లజర్ల మండలం అనంతపల్లికి చెందిన రాజు అనే వ్యక్తికి ఈ సంఘటనలో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో మొత్తం పది మంది ఉన్నారని సమాచారం. మరి మిగతా ఆరుగురు ఏమయ్యారన్నది తెలియడం లేదు.
కడియద్ద గ్రామ శివార్లలో నాలుగేళ్లుగా ఈ మందుగుండు తయారీ కేంద్రం ఉంది. దీని యజమాని అన్నవరం అనే వ్యక్తి. నిజానికి దీని సామర్థ్యం 15 కిలోలు అయినప్పటికీ అంతకన్నా చాలా రెట్లు ఎక్కువగా ఇందులో బాణాసంచా తయారవుతోందనే ఆరోపణలున్నాయి. ఈ విషయంపై గ్రామస్తులు అనేక సార్లు అధికారులకు పిర్యాదు చేశామని చెప్తున్నారు.
ఈ పరిశ్రమ ఊరి చివర చెరువు వద్ద ఉండడంతో అగ్నిమాపక దళం అక్కడికి చేరుకోవడానికి కొంచెం సమయం పట్టింది. అప్పటికీ, ప్రమాద స్థలికి 300 మీటర్ల దూరంలోనే అగ్నిమాపక వాహనం నిలిపివేయాల్సి వచ్చింది.
మరో వైపు ఈ ప్రమాద సంఘటన పట్ల ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.