వారికి కాదట!.. ఖాతాదారుల విశ్వాసానికి అవమానమట!- మార్గదర్శి పత్రికా ప్రకటన
మార్గదర్శికి కళంకం ఆపాదించే కుట్ర జరుగుతోందని ఆరోపించింది. మార్గదర్శిని అనుమానించడం అంటే లక్షలాది మంది ఖాతాదారుల అచంచల విశ్వాసానికే అవమానం అంటూ తన ప్రకటనలో ఎదురుదాడి చేసింది.
ఎవరిపైనైనా ఏదైనా రాసే రామోజీరావుకు తనపై వచ్చే విమర్శలకు స్పందించే గుణం లేదన్న విమర్శ ఉంది. తనకు నచ్చని రాజకీయ పార్టీలపై ఈనాడు అనేక కథనాలు రాస్తుంటుంది. ఆ కథనాలు తప్పు అని అవతలిపక్షం సవాల్ విసిరినా స్పందించే పనిచేయదు రామోజీరావుకు చెందిన ఈనాడు. మార్గదర్శి విషయంలో మాత్రం పరిస్థితి భిన్నం. వేల కోట్ల వ్యాపారం, లక్షల మంది ఖాతాదారుల నమ్మకమే పెట్టుబడిగా నడుస్తున్న వ్యాపారం. అందుకే అప్పట్లో వైఎస్ హయాంలో ఉండవల్లి ఆరోపణలు చేసినప్పుడు కూడా ఉలిక్కిపడి తన మీడియాలో వివరణ ఇచ్చుకుంది. మార్గదర్శిలో ఎలాంటి అవకతవకలు లేవని చెప్పుకుంది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి వచ్చింది.
ఇటీవల మార్గదర్శి సంస్థలో భారీగా ఏపీ అధికారులు సోదాలు నిర్వహించడం, అనేక ఉల్లంఘనలు జరిగాయని, నిధులు దారి మళ్లించారని స్వయంగా ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పడంతో మార్గదర్శి విశ్వసనీయతపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి సంస్థ ప్రముఖ పత్రికల్లో వివరణ ఇస్తూ ప్రకటనలు జారీ చేసింది. దాదాపు ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చుకుంది.
మార్గదర్శికి కళంకం ఆపాదించే కుట్ర జరుగుతోందని ఆరోపించింది. మార్గదర్శిని అనుమానించడం అంటే లక్షలాది మంది ఖాతాదారుల అచంచల విశ్వాసానికే అవమానం అంటూ తన ప్రకటనలో ఎదురుదాడి చేసింది.
తాను అక్రమంగా నిధులు మళ్లించడం లేదని ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల కట్టే చిట్ సొమ్మును తాము ఏ వ్యాపారానికి వాడుకోలేదని.. కేవలం వ్యాపారం నుంచి వచ్చే కమిషన్‌ను, ఫోర్‌మెన్‌కున్న ఆదాయం, పెనాల్టీల ద్వారా గడించిన ఆదాయాలను మాత్రమే ఇతర పెట్టుబడులకు వాడుతున్నామని.. అలా వాడుకోవడానికి చట్టం అనుమతి ఇస్తుందని చెప్పింది.
మార్గదర్శి చీటింగ్ చేసిందంటూ చిట్ రిజిస్ట్రార్ చేసిన ఘోరమైన అభియోగం దుర్బుద్ధితో చేసినదేనని మార్గదర్శి ఆరోపించింది. ఇలా పలు అంశాలపై మార్గదర్శి తన వాదనకు తగ్గట్టు వివరణ ఇస్తూ భారీ ప్రకటన జారీ చేసింది. 10 రోజుల్లో నోటీసులు జారీ చేస్తామని చెప్పిన అధికారులు.. మరి అంతవరకు ఆగకుండా కంపెనీ వివరణ తీసుకోకుండా బహిరంగంగా ప్రెస్‌మీట్లు పెట్టి ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కూడా మార్గదర్శి ప్రశ్నించింది.
తొలుత హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో రెండు గదుల అద్దె భవనంలో ప్రారంభమైన మార్గదర్శి.. 60ఏళ్ల కాలంలో 2.71 లక్షల మంది ఖాతాదారులను సొంతం చేసుకుందని వివరించింది. 17వేల మంది ఏజెంట్లకు, 4వేల మంది సిబ్బందికి ప్రస్తుతం జీవనోపాధి కల్పిస్తున్నట్టు మార్గదర్శి వివరించింది.