Telugu Global
Andhra Pradesh

మార్గదర్శిపై టీడీపీ తోకముడిచిందా? వెనక్కు లాగిందెవరు?

నిజంగానే డిబేట్ జరిగుంటే అది రామోజీతో పాటు టీడీపీకి కూడా బాగా డ్యామేజ్‌ అయ్యుండేది. ఆ విషయాన్ని గ్రహించి రామోజీయో లేకపోతే చంద్రబాబు నాయుడో జీవీరెడ్డిని డిబేట్‌కు పోకుండా ఆపినట్లు ప్రచారం జరుగుతోంది.

మార్గదర్శిపై టీడీపీ తోకముడిచిందా? వెనక్కు లాగిందెవరు?
X

మార్గదర్శి చిట్ ఫండ్స్ కు సంబంధించి 14వ తేదీన అంటే ఆదివారం జరగాల్సిన డిబేట్ నుండి టీడీపీ తోకముడిచిందా? మార్గదర్శిని అడ్డుపెట్టుకుని ఛైర్మన్ రామోజీరావు వేల కోట్ల రూపాయలు చీటింగ్ చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టులో కేసు నడుపుతున్నారు. ఛైర్మన్‌గా రామోజీరావు, ఎండీ శైలజపై ఏ1, ఏ2 నిందితులుగా సీఐడీ కేసులు నమోదుచేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. రామోజీ మోసాలు ఇప్పటికే ఉండవల్లి చాలావరకు కోర్టులో ఎండగట్టారు.

సీఐడీ విచారణలో చిట్ ఫండ్స్ డబ్బులను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించినట్లు విచారణలో రామోజీ అంగీకరించారని జగన్మోహన్ రెడ్డి మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇదే విషయం కోర్టులో కూడా నిర్ధారణ అయ్యిందని ఉండవల్లి చెప్పారు. ఇలాంటి కేసుపై టీడీపీ తరపున అధికార ప్రతినిధి జీవీరెడ్డి చర్చకు సవాలు విసిరారు. మార్గదర్శిపై ఉండవల్లి చేస్తున్న ఆరోపణలన్నీ తప్పులని తాను నిరూపిస్తానని జీవీరెడ్డి చేసిన సవాలును మాజీ ఎంపీ అంగీకరించారు.

ఇద్దరూ మాట్లాడుకుని ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో డిబేటుకు కూర్చోవాలని నిర్ణయించుకున్నారు. అయితే వ్యక్తిగత పనులతో తాను బిజీగా ఉన్నాను కాబట్టి డిబేట్‌కు రాలేకపోతున్నట్లు ఉండవల్లికి జీవీ మెసేజ్ పెట్టారట. దాంతో మార్గదర్శి అక్రమాలపై టీడీపీ తోకముడిచిందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రామోజీపైన ఉండవల్లి చేస్తున్నది రాజకీయ పరమైన ఆరోపణలు కాదు. రాజకీయ పరమైన ఆరోపణలైతే జీవీరెడ్డే కాదు ఎవరైనా గాలిని పోగేసి సమర్థిస్తూ మాట్లాడొచ్చు.

కానీ ఇక్కడ విషయం ఆర్థికపరమైనది. అంటే వేల కోట్లరూపాయల మోసానికి సంబంధించింది. ఇన్ని సంవత్సరాలుగా రామోజీపై ఉండవల్లి పోరాటం చేయగలుగుతున్నారంటే కేవలం మాజీ ఎంపీకి ఉన్న గుడ్ విల్, క్రెడిబులిటి, మార్గదర్శిలో మోసాలు జరుగుతున్నది వాస్తవం కాబట్టే. ఉండవల్లి ఆరోపణలను రామోజీయే ఖండించనప్పుడు తాను ఎలా సమర్థించగలనని జీవీ అనుకున్నారో అర్థంకావటంలేదు. నిజంగానే డిబేట్ జరిగుంటే అది రామోజీతో పాటు టీడీపీకి కూడా బాగా డ్యామేజ్‌ అయ్యుండేది. ఆ విషయాన్ని గ్రహించి రామోజీయో లేకపోతే చంద్రబాబు నాయుడో జీవీరెడ్డిని డిబేట్‌కు పోకుండా ఆపినట్లు ప్రచారం జరుగుతోంది.

First Published:  14 May 2023 8:41 AM IST
Next Story