Telugu Global
Andhra Pradesh

బిగుస్తున్న ఉచ్చు.. మార్గదర్శి మేనేజర్లు అరెస్ట్

ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. చివరకు మేనేజర్లను అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామం.

బిగుస్తున్న ఉచ్చు.. మార్గదర్శి మేనేజర్లు అరెస్ట్
X

మార్గదర్శి వ్యవహారంలో ఏపీ సీఐడీ దూకుడుగా ఉంది. నలుగురు బ్రాంచ్ మేనేజర్లను సీఐడీ అరెస్ట్ చేసింది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు బ్రాంచ్ లకు చెందిన మేనేజర్లను అరెస్ట్ చేసి న్యాయమూర్తుల ఎదుట హాజరు పరిచారు అధికారులు. విశాఖ, విజయవాడ బ్రాంచ్ మేనేజర్లకు ఈనెల 24 వరకు రిమాండ్ విధించారు.

ఆదివారం కూడా సోదాలు..

చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి ఖాతాదారుల సొమ్ము పక్కదారి పట్టించి, దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో మార్గదర్శిపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. మార్గదర్శి చైర్మన్ రామోజీ రావు, ఎండీ శైలజతోపాటు బ్రాంచ్ మేనేజర్లపై కూడా సీఐడీ కేసులు పెట్టింది, వారి ఆఫీసుల్లో సోదాలు ముమ్మరం చేసింది. ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. చివరకు మేనేజర్లను అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలక పరిణామం.

సడన్ గా ఎందుకు..?

నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్స్ సేకరిస్తున్నారనే ఆరోపణలతో గతంలో మార్గదర్శిపై కేసులు నమోదు కాగా, విచారణ జరుగుతోంది. ఆ తర్వాత మార్గదర్శి సంస్థ కేవలం చిట్స్ మాత్రమే నిర్వహిస్తోంది. ఇప్పుడు ఈ చిట్స్ నిర్వహణలో కూడా కంపెనీ మోసపూరితంగా వ్యవహరిస్తోందంటూ ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.

మోసం ఎలా..?

చిట్ నిర్వహణలో సభ్యుల సంఖ్య సరిపోకపోతే కంపెనీయే టోకెన్లు తీసుకుని నెలనెలా చిట్ సొమ్ము జమచేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కంపెనీ, చిట్ సొమ్ముని కేవలం పేపర్లపై మాత్రమే చూపిస్తూ మోసం చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. గడువు మధ్యలో పాట పాడి సొమ్ము తీసుకోవాలంటే ష్యూరిటీలు చూపించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధన అడ్డు పెట్టుకుని, కొంతమంది ష్యూరిటీలు చూపించకపోతే.. వారి చిట్ మొత్తంలో కొంత సెక్యూరిటీ డిపాజిట్ కింద కంపెనీ తమ వద్దే ఉంచుకుంటోంది. ఆ సొమ్ముపై వడ్డీ కూడా ఇస్తోంది. ఇది డిపాజిట్ల సేకరణ కిందకు వస్తుంది. ఈ విషయంపై ఇప్పుడు మరోసారి ఇరుకున పడింది మార్గదర్శి కంపెనీ. ఇలాంటి లొసుగుల్ని బయటకు తీసి మార్గదర్శిని పక్కాగా బోనెక్కించారు. తప్పుడు కేసులు, రాజకీయ కక్షసాధింపులు అంటూ ఈనాడు మొత్తుకుంటున్నా.. ఈ కేసుల వ్యవహారంతో మార్గదర్శి ఇబ్బంది పడుతున్నట్టే లెక్క.

First Published:  13 March 2023 5:40 AM IST
Next Story