మార్గదర్శి కేసులో కీలక పరిణామం.. 23చిట్ గ్రూప్ ల నిలిపివేత
అన్ అకౌంటబుల్ ఖాతాల పేరుతో మరో మోసం జరుగుతోంది. ఈ మోసాలకు సీఐడీ చెక్ పెట్టింది. ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా.. చిట్ గ్రూప్ లను నిలిపివేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది.
మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలపై విచారణ చేపట్టిన ఏపీ సీఐడీ ఈరోజు కొన్ని కీలక విషయాలు వెల్లడించింది. 1982 చిట్ ఫండ్ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన చరిత్ర మార్గదర్శికి ఉందని ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. చిట్ ఫండ్ నిధులను ఇతర కంపెనీలకు మళ్లించడంతోపాటు.. మార్గదర్శి సంస్థ వివిధ మార్గాల్లో పెట్టుబడులు పెడుతోందన్నారాయన. మార్చి 10న మార్గదర్శి కేసు దర్యాప్తు చేపట్టామని, ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు 7 ఎఫ్‌ఐఆర్ లు నమోదు చేశామన్నారు.
మార్గదర్శి కేసులో A1 రామోజీరావు, A2 శైలజా కిరణ్ A3, A4గా మార్గదర్శి ఫోర్మెన్, A5గా ప్రిన్సిపల్ ఆడిటర్ కె.శ్రవణ్ కుమార్ ని నిందితులుగా చేర్చినట్లు తెలిపారు సీఐడీ డీజీ. విచారణలో వీరు సహకరించట్లేదని చెప్పారు. వేల కోట్ల రుపాయల లావాదేవీలు నిర్వహిస్తున్న మార్గదర్శి కంపెనీ లెక్కలు చూస్తే కేసు తీవ్రత అర్థం చేసుకోవచ్చని చెప్పారాయన. సీఐడీ ఎవరి ఒత్తిడితోనో దర్యాప్తు చేయట్లేదని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇచ్చిన సమాచారంతో ఆడిటింగ్ చేశామన్నారు. మార్గదర్శి సంస్థ చిట్ ఫండ్ యాక్ట్ ను ఫాలో కావడం లేదన్నారు. రామోజీ రావు వయసుకి గౌరవం ఇచ్చాం కాబట్టే, హైదరాబాద్ వెళ్లి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. సీఐడీ చట్ట ప్రకారం దర్యాప్తు చేస్తోందని, అయితే దర్యాప్తును అడ్డుకునేందుకు సీఐడీని కించపరిచేలా వార్తలు రాస్తున్నారని అన్నారు డీజీ సంజయ్. మార్గదర్శి కేసులో విచారణ జరపాల్సిందిగా కేంద్ర విచారణ సంస్థలను కోరామని స్పష్టం చేశారు.
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కీలక నిర్ణయం..
మరోవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఇదేరోజు కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శికి చెందిన 23 చిట్ గ్రూప్ లను నిలిపివేసింది. రూ.604 కోట్ల టర్నోవర్ గల 23 చిట్ గ్రూప్స్ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతపురం, అరండల్ పేట, నరసరావుపేట, విశాఖపట్నం, తణుకు, రాజమండ్రి బ్రాంచ్ లలో.. ఆడిటింగ్ లో గుర్తించిన అక్రమాల మేరకు మార్గదర్శి చిట్ గ్రూప్స్ నిలిపివేశామని ఆ శాఖ కమిషనర్ తెలిపారు. అందులోని గ్రూప్ సభ్యులకు ఆ డబ్బులు వెనక్కు ఇప్పిస్తామని క్లారిటీ ఇచ్చారు.
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన..
చిట్ పాడుకున్నవారికి మార్గదర్శి వెంటనే డబ్బులు ఇవ్వదు. మార్గదర్శి లోనే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునేలా బలవంతం చేస్తారు. ఇది నిబంధన ఉల్లంఘన కిందకే వస్తుంది. చిట్ రిజిస్ట్రార్ అనే వ్యవస్థను వాడుకుని ష్యూరిటీ ఇచ్చిన వారి ఆస్తులను అటాచ్ చేస్తున్నారు. ఇది కూాడ అక్రమమే. చిట్ కస్టమర్ ల ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ నిబంధనలు అస్సలు పాటించట్లేదు. అన్ అకౌంటబుల్ ఖాతాల పేరుతో మరో మోసం జరుగుతోంది. ఈ మోసాలకు సీఐడీ చెక్ పెట్టింది. ఇకపై ఇలాంటి మోసాలు జరగకుండా.. చిట్ గ్రూప్ లను నిలిపివేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయం తీసుకుంది.