Telugu Global
Andhra Pradesh

ఏపీలో మణిపూర్ రాజకీయం

మణిపూర్ లో చిక్కుకున్న తెలుగువారిని తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుగానే స్పందించింది. కానీ ఏపీలోనే ఈ వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది.

ఏపీలో మణిపూర్ రాజకీయం
X

మణిపూర్ అల్లర్లు, అక్కడ జరుగుతున్న ఆందోళనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందినవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. వివిధ అవసరాల కోసం మణిపూర్ వెళ్లినవారితోపాటు, చదువు కోసం అక్కడికి వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారు. వారిని తరలించేందుకు ఇక్కడి ప్రభుత్వాలు చొరవ చూపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది, పోలీసులు హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెబుతున్నారు. ఏపీ ప్రభుత్వంపై మాత్రం తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడి నుంచి విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశామని చెబుతోంది. విపక్షాలు మాత్రం విద్యార్థులను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, వైసీపీని టార్గెట్ చేస్తోంది.

మణిపూర్ లోని ఎన్ఐటీ క్యాంపస్ లో 150మంది తెలుగు విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరిలో 70మంది ఏపీకి చెందినవారున్నారు. మూడు రోజులుగా అక్కడ విద్యార్థులు తిండీ తిప్పలు లేకుండా ఉన్నారని తెలుస్తోంది. వారిని కనీసం పలకరించేవారు లేరని ఏపీలోని ప్రతిపక్షాలంటున్నాయి. టీడీపీ అనుకూల మీడియా కూడా బాధితుల ఇంటర్వ్యూలిస్తూ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం అంటూ విమర్శలు మొదలు పెట్టింది.

ఏపీ భవన్ లో ఏర్పాట్లు..

మరోవైపు ఏపీ ప్రభుత్వం మాత్రం విద్యార్థులను రక్షించే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్ లో విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని చెప్పారు ఏపీ అధికారులు. విద్యార్థులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ హెల్ప్ లైన్ లో సంప్రదించాలని సూచించారు. విద్యార్థుల తరలింపు కోసం ప్రత్యేక విమానం కూడా ఏర్పాటు చేశామని చెబుతున్నారు అధికారులు.

రాజకీయ రచ్చ..

మణిపూర్ లో చిక్కుకున్న తెలుగువారిని తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుగానే స్పందించింది. కానీ ఏపీలోనే ఈ వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ విమర్శలు సంధిస్తోంది.

First Published:  7 May 2023 7:29 PM IST
Next Story