మంగళగిరి వైసీపీ ఓవర్‌లోడ్...
ఎమ్మెల్యే టికెట్టు కోసం పోటీపడే నేతలంతా వెళ్లిపోవడంతో లోకేష్ కి పోటీ లేదని, ఇతర పార్టీల మండలస్థాయి నేతలని టిడిపిలో చేర్చుకుంటూ చాపకింద నీరులా బలోపేతం వ్యూహం అమలు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ సీట్ మంగళగిరి. చారిత్రక ప్రదేశం, లక్ష్మీనృసింహుని క్షేత్రం, చేనేతల నిలయం, ఆభరణాల తయారీ కేంద్రంగా దేశవ్యాప్తంగా మంగళగిరి ఎంతో ప్రసిద్ధి చెందింది. రాజకీయంగా కూడా మంగళగిరి నియోజకవర్గానికి ఘనచరిత్రే ఉంది.
2019 ఎన్నికల్లో టిడిపి భావి అధినేత తన ప్రత్యక్ష రాజకీయ రంగ అరంగేట్రానికి మంగళగిరిని ఎంపిక చేసుకోవడంతో మరోసారి వార్తల్లోకెక్కింది మంగళగిరి. ఆ ఎన్నికల్లో లోకేష్ ఓటమి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపుతో మంగళగిరి పేరు అందరి నోర్లలోనూ నానింది. మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మంగళగిరి నియోజకవర్గం పతాక శీర్షికలకు ఎక్కుతోంది.
2024 ఎన్నికల్లో నారా లోకేష్ టిడిపి అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయనని ఓడించి తీరతామని అంటున్నారు వైసీపీ నేతలు. మా లోకేష్‌ని ఓడిస్తామంటున్న మీ అభ్యర్థి ఎవరో దమ్ముంటే ప్రకటించండి, ఎవరు అభ్యర్థి అయినా 50 వేల మెజారిటీ పైనే తెచ్చుకుని లోకేష్ ఘనవిజయం సాధిస్తారని టిడిపి కీలక నేతలు చాలెంజ్ విసిరారు.
నారా లోకేష్ లక్ష్యంగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక వైపు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మరో వైపు నుంచి విమర్శలు గుప్పిస్తున్నారు. టిడిపి నుంచి వరసగా కీలక నేతలు వైసీపీలో చేరారు. చేనేత వర్గానికి చెందిన మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు టిడిపి నుంచి వచ్చి వైసీపీ ఎమ్మెల్సీ అయిపోయారు.
గత ఎన్నికల్లో వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేనేత వర్గానికి చెందిన వారే. ఇటీవలే జనసేన అధినేతతో సమావేశం అయ్యారు. టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన గంజి చిరంజీవిని టిడిపి మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌ని చేసింది. మంగళగిరి టికెట్ తనదే అని ధీమాతో ఉన్న చిరంజీవి నారా లోకేష్ రాకతో అసంతృప్తిగానే టిడిపిలో కొనసాగారు. ఎట్టకేలకు వైసీపీలో చేరి ఆప్కో చైర్మన్ అయిపోయారు.
వైసీపీ తన ప్రయత్నాలు తీవ్రం చేయడంతో టిడిపి నుంచి చేనేత నేతలైన మాజీ మంత్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ వచ్చేశారు. గత ఎన్నికలకి ముందు మాజీ ఎమ్మెల్యే చేరారు. దీంతో వైసీపీలో కీలక చేనేత నేతలతో ఓవర్ లోడ్ అయిపోయింది. ఎవరికి వారే అన్నచందంగా వీరు రాజకీయాలు నెరపుతున్నారు.
ఎమ్మెల్యే టికెట్టు కోసం పోటీపడే నేతలంతా వెళ్లిపోవడంతో లోకేష్ కి పోటీ లేదని, ఇతర పార్టీల మండలస్థాయి నేతలని టిడిపిలో చేర్చుకుంటూ చాపకింద నీరులా బలోపేతం వ్యూహం అమలు చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర వల్ల నియోజకవర్గానికి దూరంగా కాగా, ఆ లోటు రాకుండా నియోజకవర్గ నేతలు రోజూ ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉంటున్నారు. మా అభ్యర్థి లోకేష్, మేము 50 వేల మెజారిటీతో గెలుస్తాం..మీ అభ్యర్థి ఎవరో కనీసం చెప్పగలరా అంటూ టిడిపి నేతలు సవాళ్లు విసురుతున్నరు.
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి కానీ, ఎమ్మెల్సీ మాజీ మంత్రి మురుగుడు హనుమంతరావు కానీ తామే అభ్యర్థులం అని ప్రకటించలేకపోతుండడం..అధిష్టానం మంగళగిరి సీటుపై ఎటువంటి ప్రకటనలు చేయకపోవడంతో టిడిపి జెట్ స్పీడుతో తన పని తాను చేసుకుపోతోంది.