Telugu Global
Andhra Pradesh

మొన్న జేపీ, నిన్న మందకృష్ణ.. బాబు వ్యూహం, ఎల్లో మీడియా ప్రచారం

మందకృష్ణ కలయికతో ఏపీలోని ఆ సామాజిక వర్గమంతా చంద్రబాబుతోనే ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ ఎల్లో మీడియా వార్తలివ్వడం విశేషం.

మొన్న జేపీ, నిన్న మందకృష్ణ.. బాబు వ్యూహం, ఎల్లో మీడియా ప్రచారం
X

"ఏపీలో ఏదో జరిగిపోతోంది, మేధావులంతా కూటమికి మద్దతిస్తున్నారు. కుల సంఘాలన్నీ కూటమికి జై కొడుకున్నాయి, మార్పు మొదలైంది, చంద్రబాబు గెలవబోతున్నారు.." ఈ ప్రచారంతో ఎల్లో మీడియా ఊదరగొడుతోంది. చంద్రబాబు మెల్లి మెల్లిగా తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దానికి తగ్గట్టే ఎల్లో మీడియా ప్రచారం చేసిపెడుతోంది. ఈ ప్రచారంతోనే 2019లో ఘోరంగా దెబ్బతిన్నారు చంద్రబాబు. మళ్లీ ఇప్పుడు అదే ప్రచారం ఆయన కొంప ముంచేలా ఉంది.

మొన్న జయప్రకాష్ నారాయణ, చంద్రబాబుకి మద్దతిస్తున్నట్టు ప్రచారం చేయగానే ఎల్లో మీడియా ఓ రేంజ్ లో కథనాలిచ్చింది. జగన్ పాలనకు వ్యతిరేకంగా జేపీ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేసింది. చంద్రబాబు లేకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరిగిందంటూ వార్తలిచ్చింది. ఈ బోగస్ ప్రచారాన్ని వైసీపీ నేతలు గట్టిగానే ఖండించారు. జేపీ కుల లాబీయింగ్ ని బయటపెట్టారు. ఇక తాజాగా మందకృష్ణ మాదిగ, చంద్రబాబుని కలసి ఆయనకు మద్దతు తెలిపినట్టు ప్రకటించారు. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కూటమికి మద్దతిచ్చిన మందకృష్ణ ఇప్పుడు ఏపీ ఎన్నికల సమయంలో కూడా అదే కూటమికి జై కొట్టారు. ఇందులో కొత్త విషయమేమీ లేదు. కానీ మందకృష్ణ కలయికతో ఏపీలోని ఆ సామాజిక వర్గమంతా చంద్రబాబుతోనే ఉన్నట్టు కలరింగ్ ఇస్తూ ఎల్లో మీడియా వార్తలివ్వడం ఇక్కడ విశేషం.

రాజ్యాంగ సవరణ లేకుండా వర్గీకరణ అసాధ్యం అని తెలిసినా కూడా చంద్రబాబు గతంలో ఎస్సీ వర్గీకరణ చేసినట్టు చేసి ఆ తర్వాత కోర్టులు అడ్డుపడ్డాయని చేతులెత్తేశారు. తాజాగా మళ్లీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్న మందకృష్ణ మాదిగ.. ఎన్డీఏ కూటమితోనే అది సాధ్యమని చెప్పారు. జాతీయ స్థాయిలో మోదీకి, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయకత్వానికి తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. వర్గీకరణకు సీఎం జగన్‌ వ్యతిరేకమని, గతంలో ఎస్సీల కోసం ప్రత్యేకంగా అమలైన 29 సంక్షేమ పథకాల్ని ఆయన రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనిలో పనిగా వైసీపీ జాబితాపై కూడా మందకృష్ణ విమర్శలు సంధించారు. 29 రిజర్వ్డ్ స్థానాల్లో మాదిగ వర్గానికి కేవలం 10 స్థానాలే వైసీపీ కేటాయించిందన్నారు మందకృష్ణ. ఇక ఆయన్ను అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా ఎక్కడలేని రాద్ధాంతం చేస్తోంది. బడుగు బలహీన వర్గాలకు చంద్రబాబే అండదండ అంటూ రెచ్చిపోతోంది.

First Published:  25 March 2024 2:42 AM GMT
Next Story