Telugu Global
Andhra Pradesh

అక్క సీటుకు ఎసరు పెట్టినట్లేనా?

మౌనిక పోటీ చేయటం అంటే అక్క అఖిలప్రియకు మొండిచెయ్యి ఖాయమన్నది అర్థ‌మైపోతోంది. నిజానికి అఖిల వ్యవహారాలను చంద్రబాబు భరించలేకపోతున్నారు.

అక్క సీటుకు ఎసరు పెట్టినట్లేనా?
X

అక్క సీటుకు చెల్లెలు ఎసరు పెట్టడం ఖాయంగానే అనిపిస్తోంది. అక్క ఎవరు? చెల్లెలు ఎవరు? ఏ సీటుకు ఎసరు? అంటే అక్క మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. చెల్లెలు భూమా మౌనిక. ఎసరు ఆళ్ళగడ్డ అసెంబ్లీ టికెట్ విషయంలోనే. ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసి ఉంటుంది. సోమవారం రాత్రి భర్త మంచు మనోజ్‌తో కలిసి మౌనిక హైదరాబాద్‌లో చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. వీళ్ళ భేటీ సుమారు అర్ధ‌గంటసేపు జరిగింది.

మనోజ్, మౌనిక జంట టీడీపీలో చేరి పోటీ చేయబోతున్నారంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతోంది. భేటీ అన్నది ఇప్పుడు కుదిరింది. భేటీ తర్వాత పొలిటికల్ ఎంట్రీపై మనోజ్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చేసినట్లే. అన్నీ కుదిరితే రాబోయే ఎన్నికల్లో మౌనిక ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి పోటీ చేయటం ఖాయమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మౌనిక పోటీ చేయటం అంటే అక్క అఖిలప్రియకు మొండిచెయ్యి ఖాయమన్నది అర్థ‌మైపోతోంది. నిజానికి అఖిల వ్యవహారాలను చంద్రబాబు భరించలేకపోతున్నారు.

కానీ చాలాకాలంగా ఎందుకనో సహిస్తున్నారు. బహుశా భూమా అఖిలకు సరైన ప్రత్యామ్నాయం లేకే ఇంతకాలం భరించినట్లున్నారు. ఇపుడు అఖిల ప్లేసులో చెల్లెలు మౌనికే వస్తుంటే ఇక అడ్డేముంది? అందుకనే మౌనిక ఆళ్ళగడ్డలో పోటీ చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ప్రస్తుతం ఆళ్ళగడ్డకు అఖిల ఇన్‌చార్జిగా ఉన్నా ఆమె దృష్టంతా నంద్యాల మీదే ఉంది. నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, ఏవీ సుబ్బారెడ్డి ఉన్నా అఖిల తనదైన పద్ధ‌తిలో నియోజకవర్గంలో తిరిగేస్తు పార్టీని కంపు చేసేస్తున్నారు.

నంద్యాలలో తిరగొద్దని చంద్రబాబు చెప్పినా అఖిల వినిపించుకోవటంలేదు. అఖిలను పార్టీలో నుండి పంపేయాలని చంద్రబాబుపై సీనియర్లు గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. అయినా ఓపికపట్టారు. మౌనిక గనుక పార్టీలో చేరితే వెంటనే ఆళ్ళగడ్డకు ఇన్‌చార్జిగా ప్రకటించే అవకాశమందని సమాచారం. అప్పుడు అఖిల తనంతట తానే వేరే దారి చూసుకుంటుంది. తర్వాత సమయం చూసుకుని మౌనికకు టికెట్ ఖాయంచేసే అవకాశాలున్నాయట. ఏదేమైనా తాజా పరిణామాలను బట్టి చూస్తుంటే అక్క సీటుకు చెల్లెలు ఎసరు తేవటం ఖాయమనే అనిపిస్తోంది.

First Published:  1 Aug 2023 12:06 PM IST
Next Story