సీట్లను బట్టే నిర్ణయం - కర్నాటక ఎన్నికలపై ఖర్గే
కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వచ్చే సీట్లను బట్టే ఏం చేయాలనేది నిర్ణయిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలు శనివారం వెలువడనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాల్లో ఒకవేళ హంగ్ ఏర్పడితే జేడీఎస్ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేలను తిప్పుకోవడమే వారి ఆపరేషన్..
బీజేపీ ఆపరేషన్ కమలం వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందని విలేకరులు ప్రశ్నించగా, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడమే వారి ఆపరేషన్ అని ఖర్గే విమర్శించారు. ఆ కుట్రకే ఆపరేషన్ కమలం అని పేరు పెట్టుకున్నారు తప్ప.. అంతకుమించి ఏమీ లేదని ఆయన చెప్పారు.
ఎవరూ ఎవరినీ కలవలేదు.. పొత్తుల గురించి మాట్లాడలేదు...
కర్నాటకలో ప్రభుత్వ ఏర్పాటు విషయమై జేడీఎస్‌తో తాను సంప్రదింపులు జరుపుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖర్గే కొట్టిపారేశారు. తమలో ఎవరూ ఎవరినీ కలవలేదని, పొత్తుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. శనివారం వెల్లడయ్యే ఫలితాల్లో తమకు వచ్చే సీట్లను బట్టి ఏం చేయాలనేది నిర్ణయించుకుంటామని తెలిపారు.