జనసేనకు షాక్
రాబోయే ఎన్నికల్లో తన టికెట్ విషయమై మాట్లాడాలని శేషుకుమారి ప్రయత్నాలు చేసినా ఫెయిలయ్యాయని సమాచారం. దాంతో ఇక లాభం లేదని అర్థంచేసుకుని శేషుకుమారి రాజీనామా చేసేశారు.
జనసేనకు పెద్ద షాక్ తగిలింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో సీనియర్ నేత మాకినీడు శేషుకుమారి పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని స్వయంగా మాకినీడే చెప్పారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ఈమె జనసేనలోనే ఉన్నారు. పార్టీ బలోపేతానికి చాలానే కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో పిఠాపురంలో పోటీ చేసిన శేషుకుమారికి సుమారు 27 వేల ఓట్లొచ్చాయి. గత ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 138 నియోజకవర్గాల్లో 27 వేల ఓట్లు తెచ్చుకున్న నేతలు చాలా తక్కువ మంది ఉన్నారు.
శేషుకుమారికి వచ్చిన ఓట్లలో ఆమె వ్యక్తిగత ఓట్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే కాపు నేతయిన శేషుకుమారి పార్టీ కోసం మొదటి నుండి కష్టపడ్డారు. కాబట్టే ఆమెకు అన్ని ఓట్లొచ్చాయి. ఓడిపోయినా పార్టీని వదిలేయకుండా నియోజకవర్గంలో కష్టపడుతునే ఉన్నారు. 2024లో టికెట్‌ను ఆశించారు. పవన్ కల్యాణ్ గనుక పోటీ చేయకపోతే తనకే టికెట్ దక్కుతుందని కూడా అనుకున్నారు. అయితే ఊహించని విధంగా నియోజకవర్గానికి సంబంధంలేని తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్‌ను ఇన్‌చార్జిగా నియమించారు పవన్.
వారాహి యాత్ర వాహనాన్ని ఉదయ్ శ్రీనివాసే రెడీ చేసి ఇచ్చారనే ప్రచారం అందరికీ తెలిసిందే. బహుశా అందుకు బహుమానంగా ఇన్‌చార్జిగా నియమించారేమో. రాబోయే ఎన్నికల్లో తన టికెట్ విషయమై మాట్లాడాలని శేషుకుమారి ప్రయత్నాలు చేసినా ఫెయిలయ్యాయని సమాచారం. దాంతో ఇక లాభం లేదని అర్థంచేసుకుని శేషుకుమారి రాజీనామా చేసేశారు. నిజానికి పవన్‌కు ఏమాత్రం విజ్ఞత ఉన్నా శేషుకుమారి లాంటి జనబలం ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇచ్చి పార్టీలోనే ఉంచుకోవాలి.
కానీ పవన్ ఆలోచనలన్నీ విచిత్రంగా ఉంటాయి కదా. పార్టీలో తనకు తప్ప ఇంకెవరికీ ప్రాధాన్యత దక్కకూడదన్న ఆలోచనతో పవన్ ఉంటారు. తాను షూటింగుల్లో బిజీగా ఉంటారు కాబట్టి, పార్టీని నడపాలి కాబట్టే జనబలం లేని నాదెండ్ల మనోహర్‌ను పక్కన పెట్టుకున్నారు. వారాహి యాత్రలో తన వాహనంలో పవన్ ఎవరినీ పక్కన ఉంచుకోనిది ఈ కారణంతోనే. మొత్తానికి పార్టీకి రాజీనామా చేసిన శేషుకుమారి తొందరలోనే వైసీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఆమె పార్టీలో చేరితే వైసీపీకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుందనే అనుకోవాలి.
♦