Telugu Global
Andhra Pradesh

అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రాలేనంటూ సమాధానం

నోటీసులకు అవినాష్ రెడ్డి లేఖ ద్వారా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణకు తాను రాలేనని ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని ఆయన సీబీఐకి లేఖ రాశారు. ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇచ్చారు.

అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు.. విచారణకు రాలేనంటూ సమాధానం
X

ఏపీ సీఎం జగన్ బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ ఎంక్వయిరీ కొనసాగుతోంది. ఈ కేసులో విచారణకు రావాలంటూ తాజాగా సీబీఐ అధికారులు కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఆయన తరపున పీఏ రాఘవరెడ్డి నోటీసులు తీసుకున్నారు. ఈరోజు(మంగళవారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే నోటీసులకు అవినాష్ రెడ్డి లేఖ ద్వారా సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. విచారణకు తాను రాలేనని ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని ఆయన సీబీఐకి లేఖ రాశారు. ఫోన్ ద్వారా కూడా సమాచారం ఇచ్చారు.

2019 మార్చి 14న పులివెందులలోని తన ఇంట్లోనే వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు దర్యాప్తును అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సిట్‌ కు అప్పగించారు. ఆ తర్వాత కేసు విచారణ సీబీఐ చేపట్టింది. విచారణ ఏపీలో కొనసాగితే నిందితులు ప్రభావితం చేసే అవకాశముందని వివేకా కుమార్తె సునీత వేసిన పిటిషన్ పై స్పందించిన సుప్రీంకోర్టు తెలంగాణలో విచారణ జరిగేలా ఆదేశాలిచ్చింది. హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు కేసు బదిలీ చేస్తూ గతేడాది నవంబరు 29న ఆదేశాలిచ్చింది.

హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాత తాజాగా విచారణ మొదలుపెట్టిన సీబీఐ.. అవినాష్‌ రెడ్డికి ఇప్పుడు నోటీసులిచ్చింది. అయితే ఈరోజు తాను విచారణకు హాజరు కాలేనంటూ ఎంపీ అవినాష్‌ రెడ్డి సీబీఐ అధికారులకు సమాచారమిచ్చారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటంవల్ల రాలేనని లేఖ రాశారు. 5 రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా వస్తానని వివరించారు. ‘చక్రాయపేటలో ప్రభుత్వాసుపత్రి ప్రారంభోత్సవం, గండి పుణ్య క్షేత్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమం కారణంగా తాను విచారణకు రాలేనని, మరో నాలుగు రోజులపాటు తనకు బిజీ షెడ్యూల్ ఉందని తెలిపారు. 5రోజుల తర్వాత విచారణకు వస్తానన్నారు. విజయవాడనుంచి రాత్రి అవినాష్ రెడ్డి పులివెందుల చేరుకున్నారు.

First Published:  24 Jan 2023 6:26 AM IST
Next Story