మైలవరం పంచాయితీ.. సజ్జల తీర్పు ఏంటంటే..?
మైలవరం పంచాయితీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది. ముందుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తన తండ్రి వ్యాఖ్యలపై సజ్జలకు వివరణ ఇచ్చుకున్నారు. మరుసటి రోజే మంత్రి జోగి రమేష్ కూడా సజ్జల వద్దకు వచ్చి కృష్ణప్రసాద్ పై ఫిర్యాదు చేశారు.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ, వైసీపీలో కూడా అంతర్గత రాజకీయాలు బయటపడుతున్నాయి. జనసేన, టీడీపీ నుంచి వైసీపీ వైపు వచ్చిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆల్రడీ గొడవలు ముదరడంతో, వాటికి సీఎం జగన్ తనదైన శైలిలో పరిష్కారాలు కూడా సూచించారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అలకను కూడా పరిష్కరించగలిగారు. నెల్లూరు జిల్లాలో కాకాణి, అనిల్ మధ్య గొడవ సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. అటు చిత్తూరులో రోజా మాత్రం సొంత పార్టీ నేతలపైనే రగిలిపోతున్నారు. ఈ పంచాయితీ కూడా ఇటీవలే జగన్ దగ్గరకు చేరింది. చెప్పుకుంటూ పోతే వైసీపీలో కూడా చిన్నాపెద్దా గొడవలు చాలానే ఉన్నాయి. తాజాగా మైలవరం పంచాయితీ మొదలైంది.
మైలవరం నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, జిల్లా మంత్రి జోగి రమేష్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. వారిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో పెడన వదిలిపెట్టి మైలవరం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు అక్కడ పరిస్థితులు మారిపోతున్నాయి. కృష్ణప్రసాద్ తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు వైసీపీలో కమ్మ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లబించడం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో కృష్ణప్రసాద్ పై కూడా ఆరోపణలు మొదలయ్యాయి. అయితే జోగి వర్గం ఓ ప్లాన్ ప్రకారమే ఇలా వసంత కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
సజ్జల వద్ద పంచాయితీ..
మైలవరం పంచాయితీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్దకు చేరింది. ముందుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తన తండ్రి వ్యాఖ్యలపై సజ్జలకు వివరణ ఇచ్చుకున్నారు. అదే సమయంలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ జోగి వర్గంపై ఆరోపణలు చేశారు. పార్టీలో కొంతమంది కావాలని తనని ఇబ్బంది పెడుతున్నారని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే జోగి రమేష్ కూడా సజ్జల వద్దకు వచ్చి కృష్ణప్రసాద్ పై ఫిర్యాదు చేశారు. కృష్ణప్రసాద్ పై జరుగుతున్న ప్రచారాని తనకేం సంబంధం లేదన చెప్పారు. మరి సజ్జల వీరిద్దరి పంచాయితీని ఎలా పరిష్కరిస్తారో చూడాలి. అసలు విషయం జగన్ కి నివేదిస్తారా, లేక తానే సర్దుబాటు చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి కృష్ణప్రసాద్ కి నియోజకవర్గంపై దృష్టిపెట్టాలని సజ్జల చెప్పి పంపించేశారని తెలుస్తోంది.