Telugu Global
Andhra Pradesh

టీడీపీ నుంచి మహాసేన రాజేష్‌ సస్పెండ్.. కారణం ఒక్కటే..!

మహాసేన రాజేష్ జనసేనకు మద్దతుగానే ఉండేవారు. కానీ టికెట్ ఆశతో టీడీపీలో చేరారు. పి.గన్నవరం టికెట్ ఆశ చూపి రాజేష్‌ను పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు.. జనసేన రూపంలో ఎసరుపెట్టారు.

టీడీపీ నుంచి మహాసేన రాజేష్‌ సస్పెండ్.. కారణం ఒక్కటే..!
X

టీడీపీ నుంచి మహాసేన రాజేష్‌ను సస్పెండ్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు పేరుతో సోషల్‌ మీడియాలో ఓ లెటర్ వైరల్‌ అవుతోంది. జనసేనను ఓడిస్తానని రాజేష్‌ ప్రకటించడంతో.. టీడీపీ నుంచి బహిష్కరించినట్లు లేఖలో ఉంది. మరోవైపు మహాసేన రాజేష్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. పార్టీ నుంచి సస్పెండ్‌ అవడానికి సైతం సిద్ధమంటూ రాజేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందుకే బహిష్కరణ...

మహాసేన రాజేష్ జనసేనకు మద్దతుగానే ఉండేవారు. కానీ టికెట్ ఆశతో టీడీపీలో చేరారు. పి.గన్నవరం టికెట్ ఆశ చూపి రాజేష్‌ను పార్టీలో చేర్చుకున్న చంద్రబాబు.. జనసేన రూపంలో ఎసరుపెట్టారు. రాజేష్ అభ్యర్థిత్వాన్ని స్థానిక జన‌సేన నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అలా.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాజకీయ క్రీడలో రాజేష్‌ బలయ్యాడు. పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన రాజేష్.. కొంతకాలం సైలెంట్‌గానే ఉన్నారు. కానీ పవన్‌ కల్యాణ్‌ వ్యవహారశైలితో విసిగిపోయి.. జనసేనకు మద్దతు ఇవ్వమని స్పష్టం చేశారు. జనసేన పోటీ చేస్తున్న అన్నిచోట్లా ఆ పార్టీ ఓటమికి పోరాడుతామన్నారు.

పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

గతంలో తాను జనసైనికుడిగా ప్రకటించుకున్నా.. పార్టీలోకి ఆహ్వానించలేదన్నారు రాజేష్. జనసేన కోసం పనిచేసిన దళితుల్ని పవన్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. పి.గన్నవరంలో పోటీచేసే అవకాశం ఇస్తే అడ్డుకున్నారని ఆరోపించారు. కూటమి విజయం కోసం ప్రచారం చేస్తుంటే మహాసేన సమావేశాలకు పవన్ ఒక్కసారి కూడా రాలేదన్నారు. తనను ఎక్కడికీ రానీయొద్దని, తొక్కేయాలని పవన్ కల్యాణ్ అన్న విషయాన్ని రాజేష్ గుర్తుచేశారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ వంద శాతం ఓడిపోతారని చెప్పారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌ను రాజేష్‌ ప్రశంసించారు. పవన్‌కల్యాణ్‌కు, చంద్రబాబుకు ఇది కంటగింపుగా మారింది. అందుకే రాజేష్‌ను బహిష్కరించినట్లు తెలుస్తోంది.

First Published:  9 May 2024 7:40 AM GMT
Next Story