Telugu Global
Andhra Pradesh

ప్రకాశంలో మాగుంట సంచలనం.. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎంపీ

పదే పదే మాగుంట పేరును చేరుస్తూ బాలినేని చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ దశలో మాగుంట మాత్రం తన విధేయత నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ వ్యవహారాన్ని హైలైట్ చేశారు.

ప్రకాశంలో మాగుంట సంచలనం.. డీఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎంపీ
X

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీ మారుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో పార్టీతో ఆయనకు గ్యాప్ వచ్చిందని, అందుకే ఆయన జగన్ కు దూరమవుతున్నారనే ప్రచారం చాన్నాళ్లుగా ఉంది. బాలినేనితో జట్టుకట్టి మాగుంట కూడా అధిష్టానానికి ఎదురుతిరిగారని అంటున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే ఇటీవల అనుచరుల దగ్గర ఆయన పార్టీ మార్పు వ్యాఖ్యలు చేశారంటూ మరో వార్త చక్కర్లు కొడుతోంది. అదంతా ఫేక్ న్యూస్ అంటున్నారు ఎంపీ మాగుంట. ఆ ఫేక్ న్యూస్ సర్కులేట్ చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ఒంగోలు డీఎస్పీకి ఫిర్యాదు చేయడం ఇక్కడ కొసమెరుపు.

నిప్పులేనిదే పొగరాదు. అయితే సోషల్ మీడియా చాలాసార్లు నిప్పు లేకుండానే పొగ పెట్టేస్తుంది, తగలబెట్టేస్తుంది కూడా. నాయకులు పార్టీ మారుతున్నారు, అసంతృప్తితో ఉన్నారు అనే పుకార్లు దాదాపుగా అందరిపై వస్తుంటాయి. ఈ పార్టీ, ఆ పార్టీ అని లేకుండా అన్ని పార్టీల నాయకులపైనై పుకార్లు షికార్లు చేస్తుంటాయి. కొందరు లైట్ తీసుకుంటారు, మరికొందరు తమ వెర్షన్ మాత్రమే వినిపించి సరిపెడతారు. మరికొందరు ఇంకాస్త ఎక్కువగా రియాక్ట్ అవుతారు. సరిగ్గా అలానే రియాక్ట్ అయ్యారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. అయితే మాగుంటపై చాన్నాళ్లుగా బలమైన ప్రచారం జరుగుతోంది. పదే పదే మాగుంట పేరును చేరుస్తూ బాలినేని చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఈ దశలో మాగుంట మాత్రం తన విధేయత నిరూపించుకోవాలనుకుంటున్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ వ్యవహారాన్ని హైలైట్ చేశారు.

ప్రకాశంలో రగడ..

ప్రకాశం జిల్లాలో వైసీపీకి ముందు ముందు కష్టకాలం ఉన్నట్టుగా సంకేతాలు కనపడుతున్నాయి. ఆల్రడీ బాలినేని ఫైర్ లో ఉన్నారు. ఇప్పటికే రెండు నియోజకవర్గాలకు ఇన్ చార్జ్ లను కూడా మార్చేశారు సీఎం జగన్. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనకు టికెట్ ఇచ్చినా పోటీ చేయబోనంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ దశలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిపై ఇలాంటి పుకార్లు రావడం, ఆయన ఖండించడం.. ఇవన్నీ జిల్లా పేరుని మరోసారి వార్తల్లో నిలబెట్టాయి.

First Published:  28 Dec 2023 11:29 AM IST
Next Story