Telugu Global
Andhra Pradesh

ఏపీలో 2.47 లక్షల ఏళ్ల క్రితమే ఆదిమానవులు నివసించారా?

ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో లభించిన 2.47 లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లు, హోమో సేపియన్స్ సుమారు 1.25 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి భారతదేశానికి వలస వచ్చారని ఇప్పటి వరకు నమ్ముతున్న సిద్దాంతాన్ని తిరగరాస్తుంది. వడోదరకు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయం చేసిన ఈ పరిశోధన ఈ విషయాన్ని తేలుస్తున్నది.

ఏపీలో 2.47 లక్షల ఏళ్ల క్రితమే ఆదిమానవులు నివసించారా?
X

ఆధునిక మానవులు (హోమో సేపియన్స్) సుమారు 1.25 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా నుండి భారతదేశానికి వలస వచ్చారని, వారు తమతో పాటు మధ్య రాతియుగపు రాతి పనిముట్లను ఈ దేశానికి తీసుకొచ్చారని చాలా కాలంగా భావిస్తున్నాం. ఇదే ఇప్పటివరకు అందరూ అంగీకరిస్తున్న సిద్ధాంతం. అయితే, అంతకుముందే ఇక్కడ ఆదిమ మానవులు సంచరించారన్న విష‌యం వెలుగులోకి వచ్చింది. ప్రకాశం జిల్లాలో లభ్యమైన లక్షల ఏళ్ల నాటి రాతి పనిముట్లే దీనికి నిదర్శనం.

2018లో కనిగిరి సమీపంలోని పాలేరు నదీతీరంలో హనుమంతునిపాడు వద్ద లభ్యమైన రాతి పనిముట్లు 2.47 లక్షల ఏళ్ల నాటివని స్పష్టమైంది. వడోదరకు చెందిన మహారాజా సాయాజీరావు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న దేవర అనిల్ కుమార్ నేతృత్వలో ఈ తవ్వకాలు జరిపారు.

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (PRL) యొక్క అటామిక్ మాలిక్యులర్, ఆప్టికల్ ఫిజిక్స్ విభాగంలోని లూమినిసెన్స్ లాబొరేటరీలో ఈ రాతి పనిముట్లపై శాస్త్రీయంగా పరిశోధన నిర్వహించారు.

ఈ అధ్యయనం భారతదేశంలో మానవ పరిణామానికి సంబంధించి పూర్తిగా కొత్త సిద్దాంతాన్ని అందిస్తుంది. ఆఫ్రికా నుండి ఆధునిక మానవులు ఈ ప్రాంతానికి రాకముందే స్టోన్ టూల్ టెక్నాలజీ ఇక్కడ కనుగొనబడిందని పరిశోధకులు చెబుతున్నారు. "ఆధునిక మానవులు ఆఫ్రికా నుండి భారతదేశానికి వలస రాకముందే వేటాడేందుకు, ఆహారాన్ని సేకరించడానికి ఉపయోగించే సాధనాలు, స్క్రాపర్లు, నోచెస్, మొదలైన రాతి పనిముట్లు ఇక్కడ ఉన్నాయి." అని దేవర అనిల్ కుమార్ చెప్పారు.

"ఈ సాధనాలు బహుశా ప్రాచీన హోమినిన్ లు తయారుచేసి ఉండవ‌చ్చు, కానీ శిలాజ అవశేషాలు లేకపోవడం వల్ల, ఈ సాధనాలను ఎవరు తయారు చేశారో చెప్పడం కష్టం. కానీ వారు ఖచ్చితంగా హోమో సేపియన్లు మాత్రం కాదు," అని అతను చెప్పాడు.

ప్రకాశం జిల్లాలో లభించిన ఈ రాతి ముట్ల ఆధారంగా ఇప్పటి వరకు నమ్ముతున్న హోమోసెపియన్స్ సిద్ధాంతం తప్పని రుజువు కావచ్చని పరిశోధకుల భావన.

First Published:  11 Aug 2022 8:38 AM IST
Next Story