వారం రోజులు, 63 లక్షల కుటుంబాలు.. ఇదీ మా బలం
జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి చెప్పడం, పనిలో పనిగా ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటం.. ఒకరకంగా ఈ ఏడాదిలోనే ఏపీ ఎన్నికలు అన్నంతగా సీన్ మారిపోయింది.
ఎన్నికలకు టైమ్ దగ్గరపడితే రాజకీయ పార్టీలన్నీ థర్డ్ పార్టీలతో సర్వేలు చేయిస్తుంటాయి. కానీ, ఏపీలో మాత్రం అధికారి వైసీపీ, అధికారికంగా పబ్లిక్ పల్స్ పట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ జనంలోకి వెళ్తోంది. మాకు నిజంగానే నమ్మకం ఉంది అని చెబుతున్నవారి ఇంటికి స్టిక్కర్లు వేసి, వారి మొబైల్ ఫోన్లనుంచి మిస్డ్ కాల్ కూడా తీసుకుంటుంది. వారం రోజుల్లో ఇలా వైసీపీ నాయకులు కలసిన కుటుంబాలు 63 లక్షలు. వైసీపీ ఇచ్చిన నెంబర్ కి వచ్చిన మిస్డ్ కాల్స్ 47 లక్షలు. ఈ గణాంకాలతో ఆ పార్టీ ఫుల్ ఖుషీగా ఉంది. మరో వారం రోజుల్లో మొత్తం లిస్ట్ ప్రకటిస్తామని, మెగా పబ్లిక్ సర్వే వివరాలు ఈనెల 21 తర్వాత ప్రకటిస్తామని అంటున్నారు నేతలు.
మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం కూడా గడప గడపలాగే ఇలా కనపడి అలా వెళ్లిపోవడం అనుకున్నారంతా. కానీ మంత్రులంతా చేతికి సంచిలు తగిలించుకుని స్టిక్కర్లు చేతులో పట్టుకుని ఇంటింటికి తిరుగుతున్నారు. ఎమ్మెల్యేలు కూడా వారి వెంట నడుస్తున్నారు. ఇది కేవలం రెండు వారాల కార్యక్రమమే కాబట్టి.. అందరూ సీరియస్ గా తీసుకున్నారు, టార్గెట్ రీచ్ అవుతున్నారు. ప్రతి ఇంటికీ స్టిక్కర్, ప్రతి మొబైల్ ఫోన్ కీ స్టిక్కర్ అన్నట్టుగా సాగుతోంది వైసీపీ క్యాంపెయిన్.
జగన్ ప్రవేశ పెట్టిన పథకాల గురించి చెప్పడం, పనిలో పనిగా ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటం.. ఒకరకంగా ఈ ఏడాదిలోనే ఏపీ ఎన్నికలు అన్నంతగా మారిపోయింది సీన్. టీడీపీ, జనసేన కూడా స్టిక్కర్లతో హడావిడి చేసినా.. వైసీపీ మాత్రం పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది. దాదాపు 7 లక్షల మంది గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు సుమారుగా 63 లక్షల ఇళ్లను సందర్శించాలని వైసీపీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. వారం రోజుల్లో జగన్ పట్ల తమ మద్దతును వ్యక్తం చేస్తూ 47 లక్షల మంది మిస్డ్ కాల్స్ చేశారని ప్రకటించారు. తాడేపల్లి లోని వైసీపీ కేంద్ర కార్యాలయం ముందు ఉన్న డిస్ ప్లే బోర్డుపై ఈ గణాంకాలన్నీ లైవ్ లో అప్ డేట్ అవుతుంటాయి.
రెండు వారాల తర్వాత విడుదలయ్యే మెగా పబ్లిక్ సర్వే ఫలితాలతో టీడీపీలో గుబులు పుట్టడం ఖాయమంటున్నారు వైసీపీ నేతలు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని, జనంలోకి పూర్తిస్థాయిలో వెళ్లేందుకు మరిన్ని కార్యక్రమాలు తమ దగ్గర ఉన్నాయని చెబుతున్నారు. ఒకరకంగా మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంతో ప్రతిపక్షాలకు కూడా కాస్త చురుకు పుట్టినట్టయింది.