లండన్ ఎన్నికల్లో మీ సపోర్ట్ కావాలి.. పవన్ ఇమేజ్ నిజంగానే ఖండాలు దాటిందా?
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.
టాలీవుడ్‌లో అసంఖ్యాక అభిమానులు ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. హీరోగా ఇమేజ్ పీక్స్ లో ఉండగానే పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. అయితే పవన్ రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు దాటినా తన స్థాయి ఇంకా నిరూపించుకున్నది లేదు. సినిమాల పరంగా మాత్రం పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. పవన్ రాజకీయాల్లో ఇంకా తనను తాను నిరూపించుకోకపోయినా ఆయన మద్దతు కోసం రాజకీయ పార్టీలు మాత్రం ఎగబడుతున్నాయి.
ఏపీలో గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ కు దగ్గర అయ్యేందుకు టీడీపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది. జనసేనపై మాది వన్ సైడ్ లవ్ అని పలుమార్లు చంద్రబాబు కూడా పేర్కొన్నారు. అనుకున్నట్టుగానే ఆ రెండు పార్టీలు దగ్గరయ్యాయి. ఇటు బీజేపీతో పొత్తు కొనసాగిస్తూనే టీడీపీతో కూడా వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని పవన్ ప్రకటించారు.
ఇక తెలంగాణ ఎన్నికల్లో కూడా బీజేపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ తీసుకుని పోటీ చేస్తోంది. పవన్ అవసరం తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో మాత్రమే కాదు.. ఇప్పుడు లండన్‌లో జరిగే ఎన్నికలకు కూడా అవసరమైంది. లండన్ మేయర్ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఓ అభ్యర్థి ఇప్పుడు పవన్ మద్దతు కోరడం చర్చనీయాంశంగా మారింది.
భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ లండన్ మేయర్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ఇటీవల హైదరాబాద్ కు వచ్చి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. లండన్ మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని.. మీ మద్దతు కావాలని.. గులాటీ పవన్ కళ్యాణ్ ను కోరారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ అభిమానులు, జనసైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు.
గులాటీ అభ్యర్థనకు పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు. భారత సంతతి నేత లండన్ ఎన్నికల్లో పోటీ చేయడం హర్షణీయమన్నారు. తన అభిమానులు, జన సైనికులతో పాటు తెలుగువారు, భారతీయులు తరుణ్ గులాటీకి ఓటు వేయాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. హీరోగా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి పార్టీలు ఆసక్తి చూపడంలో వింతేమీ లేదు కానీ, లండన్ మేయర్ ఎన్నికలకు పవన్ సపోర్టు కోరడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిజంగానే పవన్ ఇమేజ్ ఖండాంతరాలు దాటిందా..? అన్న ప్రశ్న తలెత్తుతోంది.