హామీల్లో చంద్రబాబునే మించిపోయాడా?
అమలు చేసే ఉద్దేశం ఉంటే హామీలిచ్చేముందు ఆలోచిస్తారు. ఎలాగూ అమలు చేసేది లేదు అనుకున్నప్పుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోవటంలో ఆశ్చర్యమేముంది?
హామీలిచ్చి జనాలను మాయ చేయటంలో నారా లోకేష్ తండ్రి చంద్రబాబునే మించిపోయినట్లున్నారు. ఎలాగూ హామీలను అమలుచేసేది లేదు కాబట్టి ఆకాశమే హద్దుగా నోటికేదొస్తే ఆ హామీలన్నీ ఇచ్చేస్తున్నారు. కాకినాడ యువగళం పాదయాత్రలో మాట్లాడుతూ.. 3 నెలలు ఓపికపట్టమని జనాలకు చెప్పారు. ఎందుకంటే టీడీపీ అధికారంలోకి రాగానే ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాలిచ్చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో తమ ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలిస్తుందని జనాలకు హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఐదేళ్ళల్లో భర్తీ చేసేస్తారట. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ అమలుచేస్తారట. ఏపీపీఎస్సీని బలోపేతం చేస్తారట. నాడు ఏపీ ఉద్యోగాలకు రాజధాని అయితే ఇప్పుడు గంజాయికి రాజధానిగా మారిందన్నారు. ఏపీ బ్రాండ్‌ను రిపేర్ చేయాలంటే చంద్రబాబు వల్లే అవుతుందట. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఏపీ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తామన్నారు. అలాగే సూపర్ సిక్స్‌లో ప్రకటించిన అన్నీ హామీలను అమల్లోకి తెస్తామని చెప్పారు.
మహిళలకు గ్యాస్ ఉచితంగా పంపిణీ చేస్తామని, పిల్లలకు తలా రూ.15 వేలిస్తామన్నారు. రైతులకు ఏడాదికి రూ. 20 వేలు ఖాతాల్లో వేస్తామన్న హామీలను గుర్తుచేశారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే సూపర్ సిక్స్ హామీల్లో కొన్ని 2014 ఎన్నికల్లో ఇచ్చినవే. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, మహిళలకు గ్యాస్ సిలిండర్లు, రైతు రుణమాపీ వంటి హామీలను సక్రమంగా అమలు చేయలేదు. అందుకనే రాబోయే ఎన్నికలకు మళ్ళీ పాత హామీలకే పేర్లు మార్చి సూపర్ సిక్స్ పేరుతో కొత్తగా హామీలిచ్చారు.
అయితే చంద్రబాబు హామీలిస్తే జనాలు నమ్మరని లోకేష్‌తో ఇప్పిస్తున్నారు. చంద్రబాబు మాటలనే నమ్మని జనాలు లోకేష్ హామీలను ఎలా నమ్ముతారన్న ఇంగితం తమ్ముళ్ళల్లో లోపించింది. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు నెరవేర్చి ఉంటే ఇప్పుడు మళ్ళీ జనాలు నమ్ముతారు. ఏదేమైనా హామీలివ్వటంలో లోకేష్ తండ్రి చంద్రబాబును మించిపోయినట్లే ఉన్నారు. అమలు చేసే ఉద్దేశం ఉంటే హామీలిచ్చేముందు ఆలోచిస్తారు. ఎలాగూ అమలు చేసేది లేదు అనుకున్నప్పుడు ఆకాశమే హద్దుగా రెచ్చిపోవటంలో ఆశ్చర్యమేముంది?