Telugu Global
Andhra Pradesh

కలలో కూడా ఊహించలేదు.. చెమ్మగిల్లిన కళ్లతో లోకేష్ ప్రసంగం

నెల్సన్ మండేలాని కూడా ఏ తప్పూ చేయకుండా జైలులో పెట్టారని, ఇప్పుడు చంద్రబాబుని కూడా అలాగే బంధించారన్నారు. త్వరలోనే బాబు బయటకొస్తారని నాయకులకు భరోసా ఇచ్చారు లోకేష్.

కలలో కూడా ఊహించలేదు.. చెమ్మగిల్లిన కళ్లతో లోకేష్ ప్రసంగం
X

టీడీపీ జనరల్ బాడీ మీటింగ్ లో లోకేష్ ఉద్వేగానికి లోనయ్యారు. చెమ్మగిల్లిన కళ్లతోనే ఆయన ప్రసంగించారు. గతంలో కూడా తాను జనరల్ బాడీ మీటింగ్ లకు హాజరయ్యానని, కానీ నాయకుల మధ్యలోనే కూర్చునేవాడినని, ఎప్పుడూ స్టేజ్ ఎక్కలేదని.. ఈ సారి ఆ పరిస్థితి వచ్చిందన్నారు. కలలో కూడా తాను ఇది ఊహించలేదని చెప్పారు లోకేష్. భయం మన బయోడేటాలోనే లేదన్నారు. చంద్ర‌బాబు త‌ల‌వంచ‌డు, త‌ల దించ‌డు అని చెప్పుకొచ్చారు.


టీడీపీకి సంక్షోభాలు కొత్త కాదని, గతంలో ఏ కష్టం వచ్చినా ఎన్టీఆర్, చంద్రబాబు ముందుండి పోరాడారని గుర్తు చేశారు లోకేష్. ఇందిరాగాంధీ క‌క్ష క‌ట్టి ఎన్టీఆర్ ని గ‌ద్దె దింపితే తెలుగుజాతి ఏక‌మై పోరాడి నెలరోజుల్లోనే ఆయన్ను మళ్లీ సీఎంని చేశారని చెప్పారు లోకేష్. నాటి పోరాటం వేరు, నేడు మ‌నం చేసే పోరాటం వేరు అన్నారు. ఇప్పుడు జగన్ పై పోరాడుతున్నామని చెప్పారు. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేస్తూ చంద్రబాబుని 43 రోజులు జైలులోనే నిర్బంధించారన్నారు.

చంద్రబాబు ఏం చెప్పారంటే..?

శాంతియుతంగా పోరాడాలని ములాఖత్ సమయంలో చంద్రబాబు తనకు చెప్పినట్టు గుర్తు చేశారు లోకేష్. అరాచ‌క‌ పాల‌న‌ని అంత‌మొందించేందుకు ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారన్నారు. జ‌గ‌న్ విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడ‌టానికి చంద్ర‌బాబు - ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌లిసి పోరాడాల‌ని నిశ్చ‌యించుకున్నారని చెప్పారు లోకేష్. టీడీపీ-జ‌న‌సేన కూట‌మి 160 సీట్లు గెల‌వ‌బోతోందన్నారు.

నవంబర్-1నుంచి ష్యూరిటీ..

చంద్ర‌బాబు ప్రారంభించిన బాబు ష్యూరిటీ-భ‌విష్య‌త్తుకి గ్యారెంటీ కార్యక్రమం న‌వంబ‌ర్-1 నుంచి రాష్ట్ర‌మంతా ప్రారంభం అవుతుందన్నారు లోకేష్. చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్టుపై ఆవేద‌న‌తో చనిపోయిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు తన త‌ల్లి భువ‌నేశ్వరి త్వరలోనే `నిజం గెలవాలి` అనే కార్య‌క్ర‌మం చేపడుతుందని చెప్పారు. టీడీపీ పాల‌న‌లో చంద్ర‌బాబు ఒక్క చిటికేస్తే జ‌గ‌న్ తిరిగే వారా అని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం అవమానాలు భరిస్తున్నామన్నారు లోకేష్.

టీడీపీ-జనసేన పొత్తుపై కూడా వైసీపీ విషం చిమ్ముతోందని అన్నారు లోకేష్. జాయింట్ యాక్షన్ కమిటీ స‌మావేశం అనంత‌రం ఉమ్మడి కార్యాచరణ ప్ర‌క‌టిస్తామన్నారు. మన‌కి కేవ‌లం 5 నెల‌లే స‌మ‌యం ఉందని, ఇంటింటికీ వెళ్దామని, ప్ర‌జ‌ల్ని చైత‌న్యం చేద్దామని చెప్పారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందన్నారు. నెల్సన్ మండేలాని కూడా ఏ తప్పూ చేయకుండా జైలులో పెట్టారని, ఇప్పుడు చంద్రబాబుని కూడా అలాగే బంధించారన్నారు. త్వరలోనే బాబు బయటకొస్తారని నాయకులకు భరోసా ఇచ్చారు లోకేష్.


First Published:  21 Oct 2023 1:46 PM IST
Next Story