Telugu Global
Andhra Pradesh

సోషల్ మీడియా ట్రెండింగ్ లో లోకేష్ పాదయాత్ర‌

#YuvaGalamPadayatra అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేయడానికి టీడీపీ ఐటీ సెల్ తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది రాసే సమయానికి ట్విట్టర్ లో1,15,000 ట్వీట్లతో మొదటి ప్లేస్ లో ఈ హ్యాష్ ట్యాగ్ దూసుకపోతోంది.

సోషల్ మీడియా ట్రెండింగ్ లో లోకేష్ పాదయాత్ర‌
X

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధినేత‌ చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ చేపట్టిన 'యువగళం పాదయాత్ర' ఈ రోజు ప్రారంభమైంది. కుప్పంలో ప్రారంభమైన ఈ యాత్రకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చాయి. మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఈ పాద యాత్ర #YuvaGalamPadayatra అనే హ్యాష్‌ట్యాగ్ తో ట్రెండింగ్ లో ఉంది.

#YuvaGalamPadayatra అనే హ్యాష్‌ట్యాగ్ ను ట్రెండ్ చేయడానికి టీడీపీ ఐటీ సెల్ తీవ్రంగా శ్రమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇది రాసే సమయానికి ట్విట్టర్ లో1,15,000 ట్వీట్లతో మొదటి ప్లేస్ లో ఈ హ్యాష్ ట్యాగ్ దూసుకపోతోంది. ఐటీ సెల్ ఎప్పటికప్పుడు పాదయాత్ర ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ప్రచారం ముమ్మరం చేసింది.

మరో వైపు లోకేష్ పాదయాత్రకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వైసీపీ కూడా ప్రచారం ముమ్మరం చేసింది. ఈ పాద యాత్ర వల్ల తెలుగుదేశానికి ఏ ఉపయోగమూ ఉండదని, ఎన్టీఆర్ కుటుంబం చేతుల్లో నుండి తెలుగుదేశాన్ని పూర్తిగా లాగేసుకోవడానికి ఇది చంద్రబాబు కుట్ర అని, ఈ యాత్రలో తామే అల్లర్లు సృష్టించి జగన్ మీద అభాండాలు వేయడానికి ప్రణాళికలు వేస్తున్నారనే ఆరోపణలతో వైసీపీ సోషల్ మీడియాలో ఆరోపణలు గుప్పిస్తోంది.

ఇక టీడీపీ శ్రేణులు కూడా తమేమీ తక్కువ తినలేదని నిరూపిస్తూ సైకో, అంటూ ప్రజాకంటకుడంటూ జగన్ పై విరుచుకపడుతున్నారు. అయితే రెండు పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో గొప్పవారిగా, ధైర్య‌స్తులుగా చిత్రీకరించేందుకు, మా అన్న సింహం అంటే, మా అన్న పులిబిడ్డ అని క్రూర జంతువులను ఉదహరిస్తూ పొగుడుకోవడం కొంత ఎబ్బెట్టుగా ఉంది.

కాగా లోకేష్ యువగళం పాద యాత్ర 4000 కిలోమీటర్లు, 400 రోజుల పాటు సాగనుంది.

First Published:  27 Jan 2023 4:25 PM IST
Next Story