Telugu Global
Andhra Pradesh

ఈ విష‌యంలో ఇద్ద‌రి అభిప్రాయాలు ఒక‌టే..

జగన్ విషయంలో లోకేష్‌, ప‌వ‌న్‌ వైఖరిలో మార్పు రాలేదు. జగనేమో చేయదలచుకున్న పనిని చాలా కూల్‌గా చేసుకునిపోతున్నారు. చంద్రబాబుతో పాటు వీళ్ళిద్దరూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.

ఈ విష‌యంలో ఇద్ద‌రి అభిప్రాయాలు ఒక‌టే..
X

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుకు భలే దొరికారు ఇద్దరు. చంద్రబాబు బయటున్నపుడు లోకేష్, పవన్ కల్యాణ్ మాటలు, సవాళ్ళు ఏదోలా వెళ్ళిపోయేవి. స్కిల్ స్కామ్‌లో అరెస్టయిన చంద్రబాబు 28 రోజులుగా రాజమండ్రి జైలులో రిమాండులో ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళిద్దరు సమన్వయంతో ముందుకు సాగాల్సుంది. అలాంటిది లోకేష్ పోయిన 14వ తేదీన ఢిల్లీకి వెళ్ళి గురువారం విజయవాడకు తిరిగొచ్చాడు. మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోతాడనే ప్రచారం జరుగుతోంది.

ఇదే సమయంలో జనసేనాని పవన్ కృష్ణా జిల్లాలో వారాహి యాత్ర మొదలుపెట్టారు. ఇక్కడ విషయం ఏమిటంటే పవన్ అయినా లోకేష్ అయినా పదేపదే జగన్మోహన్ రెడ్డికి వార్నింగ్‌లు మీద వార్నింగులిస్తున్నారు. ఈ ఇద్దరు ఎక్కడ మాట్లాడినా తామంటే జగన్ భయపడుతున్నారని చెబుతున్నారు. అసలు వీళ్ల‌ను చూసి జగన్ ఎందుకు భయపడాలో జనాలకు అర్థంకావటంలేదు. మొదటిసారి పోటీ చేసిన లోకేష్ మంగళగిరిలో, పవన్ భీమవరం, గాజువాకలో ఒడిపోయారు. ఇద్దరికీ కామన్ పాయింట్ ఏమిటంటే జగన్ అంటే నిలువెత్తు ధ్వేషం. జగన్‌ను ఏం చేయలేని అశక్తతను మాటల్లో చూపిస్తున్నారు.

151 సీట్ల అఖండ విజయంతో ముఖ్యమంత్రి అయిన‌ జగన్ వీళ్ళిద్దరిని చూసి భయపడటం ఏమిటో మామూలు జనాలకు అర్థంకావటంలేదు. ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళిద్దరు తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటున్నారు. ఇదే సమయంలో జగన్‌ను చాలా తక్కువగా చూస్తున్నారు. రాజకీయాల్లో అయినా ఏ రంగంలో అయినా ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదన్నది ప్రాథమిక సూత్రం. ప్రత్యర్థిని తక్కువ అంచనా వేస్తే ఏమవుతుందంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నది ఓటమికి దారితీస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఓవర్ కాన్పిడెన్స్ వల్లే 2019 ఎన్నికల్లో ఘోర ఓటమికి కారణమైంది.

అయినా జగన్ విషయంలో వీళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. జగనేమో చేయదలచుకున్న పనిని చాలా కూల్‌గా చేసుకునిపోతున్నారు. చంద్రబాబుతో పాటు వీళ్ళిద్దరూ ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు. అలా రెచ్చిపోయే చంద్రబాబు ఫలితం అనుభవిస్తున్నారు. అయినా వీళ్ళకి జ్ఞానోదయం అయినట్లులేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్ బ్యాలెన్స్ కోల్పోకుండా కూల్ గానే ఉండేవారు. మరి వీళ్ళెందుకు ఇలా బ్యాలెన్స్ కోల్పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతు.. వార్నింగ్‌లు మీద వార్నింగ్‌లు ఇస్తున్నారో అర్థంకావటంలేదు.


First Published:  8 Oct 2023 10:09 AM IST
Next Story