ఎస్‌ఐ నియామక ఫలితాల విడుదలకు లైన్ క్లియర్
అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయా అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో ఎత్తు కొలతలు పరీక్షలు చేయించింది.
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) నియామక ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఐ నియామకాలపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేస్తున్నట్టు న్యాయస్థానం మంగళవారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో విస్తృతస్థాయిలో ఎస్‌ఐ నియామకాలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రక్రియలూ పూర్తిచేస్తున్న వేళ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు ఎస్‌ఐ నియామకాల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్‌ఐ నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయనేది పిటిషనర్ల ఆరోపణ. ఈ నేపథ్యంలో అభ్యర్థుల పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయా అభ్యర్థులకు న్యాయమూర్తి సమక్షంలో ఎత్తు కొలతలు పరీక్షలు చేయించింది. ఈ సందర్భంగా రిక్రూట్‌మెంట్ బోర్డు నమోదు చేసిన కొలతలు, న్యాయమూర్తి సమక్షంలో తీసిన కొలతలు సరిపోలినట్టు గుర్తించారు. దీంతో అభ్యర్థుల పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఆదేశాలిచ్చింది.